ముంబైలో ట్రేడ్ ఫ్రాడ్..72 ఏండ్ల వృద్ధుడికి రూ.35 కోట్ల మోసం

ముంబైలో ట్రేడ్ ఫ్రాడ్..72 ఏండ్ల వృద్ధుడికి రూ.35 కోట్ల మోసం
  •     నాలుగేండ్లుగా అనధికారికంగా ట్రేడింగ్
  •      గ్లోబ్ క్యాపిటల్ బ్రోకరేజీ సంస్థపై కేసు నమోదు

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. మాతుంగా వెస్ట్‌‌కు చెందిన 72 ఏండ్ల వృద్ధుడి షేర్లతో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ అనే బ్రోకరేజీ సంస్థ నాలుగేండ్లుగా అనధికారిక ట్రేడింగ్ చేసింది. వృద్ధుడికి రూ. 35 కోట్లు నష్టం చేసి..ఆ డబ్బును అతని నుంచి వసూలు చేసింది. 

భరత్ హరక్‌‌చంద్ షా అనే వృద్ధుడు తన భార్యతో కలిసి క్యాన్సర్ రోగులకు గెస్ట్‌‌హౌస్ నడుపుతున్నాడు.1984లో తండ్రి మరణం తర్వాత వారసత్వంగా వచ్చిన షేర్లను పొందాడు. స్టాక్ మార్కెట్ జ్ఞానం లేకపోవడంతో వాటిని పట్టించుకోలేదు. అయితే, 2020లో ఫ్రెండ్ సలహాతో తన పేరిట, తన భార్య పేరిట డీమ్యాట్-ట్రేడింగ్ ఖాతాలను తెరిచాడు. 

తండ్రి నుంచి వచ్చిన అన్ని షేర్లను గ్లోబ్ క్యాపిటల్‌‌ బ్రోకరేజీ సంస్థకు ట్రాన్స్ ఫర్ చేశాడు. అదనపు పెట్టుబడులు అవసరంలేదని..ఉన్న షేర్లను ఉపయోగించి సేఫ్ గా  ట్రేడింగ్ చేయవచ్చని సంస్థ హామీ ఇచ్చింది. అలాగే, అతనికి పర్సనల్ గైడ్‌‌లుగా అక్షయ్ బారియా, కరణ్ సిరోయాలను నియమించింది. వారిద్దరూ  డీమ్యాట్- ఖాతాలను పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అకౌంట్ ఓనర్ పర్మిషన్స్ తీసుకోకుండా ఉద్యోగులిద్దరూ 2020 మార్చి  నుంచి జూన్ 2024 వరకు షేర్లను కొనడం, అమ్మడం స్టార్ట్ చేశారు.

లాభం వచ్చిందంటూ ఫేక్ స్టేట్‌‌మెంట్లు.. 

 సంస్థ ఉద్యోగులు లాభం వచ్చిందంటూ ఏటా -మెయిల్‌‌ ద్వారా ఫేక్ స్టేట్‌‌మెంట్లను పంపి షాను మభ్యపెట్టారు. ఇష్టమొచ్చినట్లుగా ట్రేడింగ్ చేశారు. షా షేర్లను వాటి విలువ కంటే ఎక్కువ మొత్తంలో ట్రేడింగ్ చేయడంతో ఆ ట్రేడ్స్ అన్నీ భారీగా నష్టపోయాయి. ఈ విషయాలేవీ షాకు చెప్పకుండా ఉద్యోగులు దాచారు. 

అయితే, 2024 జులైలో  “మీ ఖాతాల్లో రూ.35 కోట్ల డెబిట్ బ్యాలెన్స్ ఉంది. వెంటనే కట్టండి. లేకుంటే మీ మిగిలిన షేర్లు అమ్మేస్తాం” అంటూ గ్లోబ్ క్యాపిటల్ రిస్క్ మేనేజ్‌‌మెంట్ డిపార్ట్‌‌మెంట్ నుంచి షాకు  ఫోన్ వచ్చింది. దాంతో భయపడిపోయిన బాధితుడు తన మిగిలిన షేర్లన్నీ అమ్మి రూ.35 కోట్లు గ్లోబ్ క్యాపిటల్‌‌ సంస్థకు చెల్లించారు. 

ఆ తర్వాత సంస్థ వెబ్‌‌సైట్ నుంచి పూర్తి స్టేట్‌‌మెంట్ డౌన్‌‌లోడ్ చేసి పరిశీలించాడు. తనకొచ్చిన -మెయిల్ స్టేట్‌‌మెంట్లకు, వెబ్‌‌సైట్ స్టేట్‌‌మెంట్లకు మధ్య తేడాలు ఉన్నట్లు గమనించాడు. ఉద్యోగులిద్దరూ లాభాల్లో ఉన్నట్లు మెయిల్స్ చేసి సర్కులర్ ట్రేడ్స్ కు పాల్పడినట్లు నిర్ధారించుకున్నాడు. ఎన్ఎస్ఈ నోటీసులకు కూడా తన పేరుతో వారే రిప్లై ఇచ్చినట్లు గుర్తించాడు. నాలుగేండ్లుగా నకిలీ లాభాలు చూపించి నష్టాలను దాచారని పేర్కొంటూ పోలీసులకు షా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.