
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు 21700 మందికి వైరస్ సోకగా.. 686 మంది మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 5652 మంది కరోనా బారినపడగా, 269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోనూ ఒక్క ముంబైలోనే సగానికి పాజిటివ్ కేసులు ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ఈ సిటీలో వేగంగా వైరస్ వ్యాప్తిస్తుండడంతో దానిని కట్టడి చేసేందుకు మహారాష్ట్ర సర్కారు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ముంబై పోలీసులు. ఇప్పుడు సిటీ జనులకు ఇన్ స్టాగ్రామ్ లో క్రియేటివ్ గా అవేర్ నెస్ కల్పిస్తూ పోస్ట్ చేశారు. కరోనా నుంచి కాపాడుకోవడానికి ఇంటికి మించిన చోట ప్లేస్ లేదంటూ లాక్ డౌన్ ను పాటించాల్సిందిగా సూచించారు. ముంబై ప్రజలకు రెండు ఆప్షన్లు ఉన్నాయంటూ ఓ క్రియేటివ్ పోస్ట్ చేశారు. ఒకటి లాక్ డౌన్ అని కనిపిస్తోంది. రెండోది చూడాలంటే ఫొటో పై క్లిక్ చేయాలని సూచించారు. ఆ ఫొటోపై క్లిక్ చేశాక.. లాకప్ అని రెండో ఆప్షన్ కనిపిస్తుంది. ప్రజలు ఇంట్లో ఉండి లాక్ డౌన్ పాటించకుంటే.. లాకప్ తప్పదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
హ్యాట్సాఫ్ టూ క్రియేటివిటీ అంటూ వైరల్
ముంబై పోలీసుల క్రియేటివ్ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది. గురువారం ఉదయం పెట్టిన పోస్టును సాయంత్రానికే 47 వేల మందికిపైగా లైక్ చేశారు. హ్యాట్సాఫ్ టూ క్రియేటివిటీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. సూపర్, యూత్ ను కన్విన్స్ చేసేలా పోస్టు ఉందంటూ మరికొందరు కామెంట్ చేశారు.