
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీను బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద ఉద్రిక్తత నెలకొంది. షోను అడ్డుకోవడానికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మునావర్ షోను అడ్డుకుంటామని ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించిన నేపథ్యంలో..కొందరు బీజేవైఎం కార్యకర్తలు పోలీసు యూనిఫాం ధరించి శిల్పకళావేదికకు వచ్చారు. వీరిని గమనించిన పోలీసులు.. పోలీస్ యూనిఫాంలో ఉన్న బీజేవైఎం కార్యకర్తలను లాఠీలతో చితకబాదారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు .
షో ప్రారంభం..
మునావర్ ఫారూఖీ షో పై ఉత్కంఠ వీడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ కామెడీ షో ప్రారంభమైంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు షో కొనసాగనుంది. మునావర్ ఫారూఖ్ షో ను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని ఎమ్మెల్యే రాజాసింగ్, భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించిన నేపథ్యంలో...పోలీసులు శిల్పకళా వేదిక వద్ద భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. షోకు వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.