ఆ మున్సిపల్ కమిషనర్.. ఇంటి దొంగ

ఆ మున్సిపల్ కమిషనర్.. ఇంటి దొంగ
  • రూ.2కోట్ల మున్సిపల్ నిధులు హాంఫట్
  • పాలమూరులో పాత కమిషనర్ బాగోతం
  • ఐదున్నర నెలల క్రితం ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్
  • తమ బిల్లులు లేపుకున్నాడంటూ కాంట్రాక్టర్ల ఆందోళన

మహబూబ్‌నగర్, వెలుగు: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. మహబూబ్ నగర్ పాత కమిషనర్ వ్యవహారం అచ్చం అట్లనే ఉన్నది. కొందరు లీడర్లను, పాలకవర్గాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని గప్ చుప్ గా  రూ.2 కోట్లకు పైగా మున్సిపల్ నిధులను దిగమింగిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదున్నర నెలల క్రితం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ ఆఫీసులోనే ఏసీబీకి అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చేసిన పనులకు సంబంధించి మున్సిపాలిటీ నుంచి రావాల్సిన బిల్లులు కోసం చిన్నాచితక కాంట్రాక్టర్లు, వ్యాపారులు అడిగేందుకు పోతే ఆల్రెడీ వాటిని పాత సారు లేపుకొన్న విషయం తెలిసి ఆఫీసర్లు షాక్ అయ్యారు.

మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పాత కమిషనర్ వడ్డె సురేందర్ జిల్లా కేంద్రంలోని అధికారులు,  నేతలను బురిడీ కొట్టించిన వైనం ఆలస్యంగా బయటపడింది. పూర్తయిన పనులకు సంబంధించి ఏకంగా రెండు కోట్లకు పైగా మున్సిపల్ నిధులకు లెక్కలు లేకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నాచితక వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు  ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్ లో పెట్టడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. టెండర్ ద్వారా ఖరారు చేయాల్సిన ఓపనిని రూల్స్కు విరుద్ధంగా మున్సిపల్ పరిధిలో  నామినేట్ పద్ధతిన ఇప్పిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేయడంతో గతేడాది  అక్టోబర్22న ఏసీబీ ట్రాప్ చేసింది. రూ.1.65 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లాకర్లలో దాదాపు 880 తులాల బంగారం, రూ. 15 లక్షలు దొరికాయి. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. పాత బిల్లుల వ్యవహారం ప్రస్తుతం కొత్త కమిషనర్కు తలనొప్పిగా మారింది. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు డొంక కదిలింది. కాగా సదరు అధికారి వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు.

స్పెషల్ ఆఫీసర్ పాలన నుంచే..
గత పాలక వర్గం టైమ్ ముగిసిన తర్వాత పాత కమిషనర్ అక్రమాలకు తెర లేపారు. ఇదే ఆఫీసులో పనిచేసిన ఓ ఉద్యోగిని తన వ్యవహారాలు చక్కదిద్దేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాలమూరు మున్సిపాలిటీకి నెలకు రూ. లక్షల అద్దె వస్తుంది. దీనిపై కూడా సరైన లెక్కలు లేవని తెలుస్తోంది. మీని ట్యాంకుబండ్లో గుర్రపుడెక్క తొలగించే విషయంలో మంత్రినే తప్పుదోవ పట్టించినట్లు విమర్శలు వస్తున్నాయి. దాదాపు రూ. 39 లక్షలకు పైగా వృథా ఖర్చు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే స్పెషల్ ఆఫీసర్ పనులు చేసినట్లు విపక్ష కౌన్సిలర్లు నోటీస్ కూడా ఇచ్చారు. ఈ డబ్బులను కూడా డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఇక కొత్త పాలకవర్గం గత ఏడాది కొలువుదీరిన తర్వాత కమిషనర్వారిని తప్పుదోవ పట్టించి దాదాపు రెండు కోట్లకు పైగా నిధులు డ్రా చేసుకుని కాంట్రాక్టర్లకు చెల్లించలేదని తెలుస్తోంది. 

విచారణ జరపాల్సిందే..
జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ నిధులు పక్కదారి పడుతున్నాయి. మున్సిపల్ట్యాక్సులు, నల్లా బిల్లులు, కమర్షియల్టాక్సులు, ఆస్తి పన్ను, ఇతరత్రా అను మతులన్నీ ఆన్లైన్ చేసినా నిధులు దిగమింగుతున్నారు. వసూలు చేసి కొంత మంది సిబ్బంది కట్టడం లేదు. ఆఫీసర్లే అవినీతికి పాల్పడితే ఇక సిబ్బంది కూడా అదే బాటలో నడుస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు మౌనంగా ఉండి అవీనితిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్నిధులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.- అచ్చుగట్ల అంజయ్య, బీజేపీ కౌన్సిలర్, మహబూబ్‌నగర్.