- ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు
- మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచన
ములుగు, వెలుగు: ములుగు వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తప్పని సరి చేస్తూ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు ఎలాంటి లైసెన్స్ తీసుకోకున్నా చూసీచూడనట్లు వ్యవహరించిన అప్పటి అధికారులు మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యాక నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి దుకాణానికి ట్రేడ్ లైసెన్స్ఉండేలా ఇప్పటికే షాపుల వివరాలను సేకరించిన సిబ్బంది లైసెన్స్ రేట్లను హైక్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 నుంచే ఈ రేట్లు అమలులోకి వస్తాయని కలెక్టర్ నోటిఫికేషన్లోస్పష్టం చేశారు.
ట్రేడ్ లైసెన్స్రేట్లు ఇలా..
తెలంగాణలో గ్రామపంచాయతీగా ఉండి జిల్లాగాఏర్పాటైన ఏకైక జీపీ ములుగు. 2019 ఫిబ్రవరి 17న ములుగు జిల్లాగా ఏర్పాటు కాగా, స్థానికుల విన్నపం మేరకు మంత్రి సీతక్క చొరవతో జనాభా ప్రాతిపదికన ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి గ్రామపంచాయతీలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వ్యాపారులకు ప్రతీ ఏడాది ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసే అధికారం ఉండేది.
ట్రేడ్ లైసెన్స్ లు ఉన్నా లేకున్నా పట్టించుకునేవారు కాదు. దీంతో పంచాయతీ నిధులకు నష్టం వాటిల్లేదని ప్రచారం జరిగేది. మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్రేట్లను హైక్ చేస్తూ కౌన్సిల్ సభ్యులు అక్టోబర్25న తీర్మానం చేశారు. అందుకు అనుగుణంగా కలెక్టర్ దివాకర ఈనెల 14న నోటిఫికేషన్ జారీ చేశారు. క్యాటగిరీ వైజ్‌గా రోడ్ల వెడల్పు ఆధారంగా దుకాణాదారుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నారు.
సింగిల్ లైన్ రోడ్లకు అంటే 20 ఫీట్లలోపు ఉన్న రోడ్లకు ఉన్న షాపులకు గతంలో ఒక్కో ఎస్ఎఫ్టీకి రూ.3 ఉండగా దానిని డబుల్ చేస్తూ రూ.6గా నిర్ణయించారు. 30 ఫీట్ల వరకు వెడల్పు ఉన్న రోడ్ల వెంట ఉన్న షాపులకు రూ.4 నుంచి రూ.8గా, మల్టీపుల్ లైన్‌గా అంటే 30 పీట్ల కంటే ఎక్కువ ఉన్న రోడ్ల వెంట ఉన్న దుకాణాలకు రూ.5 నుంచి రూ.10కి, స్టార్‌హోటల్, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎస్ఎఫ్టీ ఒక్కదానికి రూ.6గా ఉన్న ధరను రూ.12లకు పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ధరలు 2025–--26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.
ట్రేడ్ లైసెన్స్తీసుకునేలా చర్యలు..
ములుగులో పంచాయతీరాజ్చట్టం నిబంధనల మేరకు ప్రతి వ్యాపారం చేసే దుకాణానికి లైసెన్స్తప్పనిసరిగా చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు కమిషనర్ సంపత్ వెల్లడించారు. గతంలో వ్యాపారం జరిగే తీరు, ఆర్థికలావాదేవీలను బట్టి రుసుము వసూలు చేసే వారు ఎంత చెబితే అంత కట్టాల్సి వచ్చేది.
ఇప్పుడు మున్సిపల్ చట్టం ప్రకారం ఈ విధానంతో స్క్వేర్ ఫీట్ప్రకారం ధర నిర్ణయించి వ్యాపారానికి అనుగుణంగా లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తుండటంతో చిరు వ్యాపారులకు మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ములుగులో ప్రధాన రహదారుల వెంట ఉన్న వ్యాపారస్తుల నుంచి చిన్నపాటి వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్తప్పనిసరిగా తీసుకునేలా అధికారులు చర్యలు మొదలు పెట్టారు.
ప్రతి వ్యాపారి లైసెన్స్కలిగి ఉండాలి..
ములుగులో వ్యాపారం చేస్తున్న ప్రతీ ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ లేనట్లయితే చట్టరీత్యా జరిమానాలు విధిస్తాం. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి ట్రేడ్ లైసెన్స్‌లేని వారిని గుర్తించి నోటీసులు అందజేస్తాం. కొత్త నిబంధనలు త్వరలోనే అమలులోకి వస్తాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త విధానం ద్వారా లైసెన్స్ ఫీజులను వసూలు చేస్తాం. ప్రస్తుతం ఇంటిపన్నుల వసూళ్లు జరుగుతున్నాయి.
మున్సిపాలిటీకి ప్రస్తుతం టాక్స్, నాన్‌టాక్స్ ఆదాయం తప్ప మరోటి లేదు. ప్రభుత్వం ఇటీవల రూ.15కోట్లు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. దాని ద్వారా రోడ్లు, షాపింగ్‌కాంప్లెక్స్, పార్కులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అధికారులు, సిబ్బందికి సహకరించాలి. - సంపత్, మున్సిపల్కమిషనర్, ములుగు
