పదవీకాలం పూర్తి.. అలర్ట్ ​అవుతున్న చైర్మన్లు

పదవీకాలం పూర్తి.. అలర్ట్ ​అవుతున్న చైర్మన్లు
  • మూడేళ్లు పూర్తికావడంతో అవిశ్వాస సంకేతాలు
  • అలర్ట్ ​అవుతున్న చైర్మన్లు
  • ప్యాకేజీలు, టూర్​ల పేరిట కౌన్సిలర్లకు బుజ్జగింపులు

నిర్మల్,వెలుగు: నిర్మల్​ జిల్లాలోని అవిశ్వాస రాజకీయాలకు తెరలేచింది. మున్సిపల్ చైర్మన్ల పదవీకాలం మూడేళ్లు పూర్తికావడంతో కొంత మంది కౌన్సిలర్లు అవిశ్వాస సంకేతాలు పంపుతున్నారు. రహస్యంగా ప్రచారం ఉధృతం చేసి చైర్మన్లను డైలామాలో పడేస్తున్నారు. వారం రోజులుగా నిర్మల్​, ఖానాపూర్​మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు చైర్మన్లకు స్నేహపూర్వకంగానే తమకు కావల్సిన డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మాట జవదాటని పరిస్థితులు ఉన్నా.. అదిగో పులి అన్నట్లు చైర్మన్ గిరికి ఎసరు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్యాకేజీలు, టూర్ల పేరిట మంతనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఓ మున్సిపల్ ​చైర్మన్​ కొంతమంది కౌన్సిలర్లను గోవాకు, మరికొందరిని వైజాగ్ టూర్ కు పంపేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. మరో మున్సిపాలిటీలో కొంతమంది కౌన్సిలర్లు ప్యాకేజీల పేరిట చైర్మన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వారికి పార్టీలోని కొందరు పెద్దలు కూడా సహకరిస్తున్నారని సమాచారం.

అలర్ట్ అవుతున్న చైర్మన్లు..

మున్సిపల్​చైర్మన్​పదవీ కాలం మూడేళ్లు పూర్తికావడంతో అప్రమత్తమవుతున్నారు. ఇప్పటికే మంత్రి, ఎమ్మెల్యేలకు లోకల్​పరిస్థితులు, మున్సిపల్, కౌన్సిలర్ల తీరు వివరించినట్లు తెలిసింది. కౌన్సిలర్లతో సఖ్యతగా ఉంటూ మేనేజ్​చేసుకోవాలని కొందరు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో చైర్మన్లు తమ పరిధిలోని కౌన్సిర్లను మేనేజ్​చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే టూర్లు, ప్యాకేజీల కోసం ఆఫర్లు ఇస్తున్నారు.