
- మెయిన్ రోడ్లపై 22 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు
- వరద నివారణకు ఆఫీసర్లతో ప్రత్యేక టీంలు
- ఇరుకు డ్రైన్లు, నాలాల్లోనీళ్లు సాఫీగా వెళ్లేలా చర్యలు
- గ్రేటర్ ఆఫీస్ లో 2 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు
హనుమకొండ, వెలుగు: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా గుర్తించిన లోతట్టు ప్రాంతాలతోపాటు మెయిన్ రోడ్లపై నీళ్లు నిలిచే ప్రదేశాలపై ఫోకస్ పెట్టారు. నాలాలు, డ్రైన్లలో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు. వరద నివారణకు శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ ఆఫీసర్లతో కలిసి ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లు నిల్వకుండా చూడాల్సిన బాధ్యతను క్షేత్రస్థాయిలో ఏఈలకు అప్పగించారు.
ముందుగానే లోతట్టు ప్రాంతాల గుర్తింపు
గత అనుభవాల దృష్ట్యా జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు ముందుగానే లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. వరంగల్ నగర వ్యాప్తంగా సంతోషీమాత కాలనీ, బృందావన్ కాలనీ, సాయి నగర్ కాలనీ, బొందివాగు నాలా పరివాహక ప్రాంతాలు, శివ నగర్, ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, సమ్మయ్య నగర్, గోపాలపూర్, భద్రకాళి టెంపుల్ ఏరియా, ములుగు రోడ్డు, సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్ఆర్ నగర్ తదితర 135 లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లు తేల్చారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో వరద నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోయేలా జవాన్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, ఏఈలు చర్యలు తీసుకునేలా ఆదేశాలిచ్చారు.
అంతేకాకుండా గ్రేటర్ సిటీ పరిధిలోని మెయిన్ రోడ్లపై 22 చోట్ల నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానంగా భీమారం, గోపాలపూర్ విజయనగర కాలనీ, హనుమకొండ వికాస్ నగర్, భవానీ నగర్, జేఎన్ఎస్ స్టేడియం, అలంకార్ జంక్షన్, ములుగు రోడ్డు, ఎంజీఎం, పోచమ్మ మైదాన్ తదితర ప్రాంతాలున్నాయి. ఆయా రోడ్లపై నీళ్లు నిలవకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
గంటలో క్లియర్ చేసేలా..
వరద ప్రవాహం నేపథ్యంలో డ్రైనేజీలు, నాలాలు చెత్తాచెదారంతో నిండిపోతుండడంతో ఎప్పటికప్పుడు డీ సిల్ట్ చేసేలా శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాయి. చాలాచోట్ల ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలతో బ్లాకేజీలు ఏర్పడుతుండగా.. ప్రధాన నాలాలతోపాటు అంతర్గత డ్రైన్లలో ఎక్కడ వాటర్ జామ్ అయినా గంటలోనే క్లియర్ చేయాలని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. ఈ మేరకు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. బల్దియాలోని జేసీబీలతోపాటు మ్యాన్ పవర్ తో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తున్నారు.
టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు
వరంగల్ నగరంలో ముంపు సమస్యతో ఇబ్బందులు తలెత్తితే వెంటనే సహాయ సహకారాలు అందించేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు బల్దియా హెడ్ ఆఫీస్ లో 2 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా 1800 425 980, 97019 99645 నంబర్లకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. కాలనీలు జలమయం అయితే అక్కడి వరద బాధితులకు సహాయం అందించేందుకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
ఇరుకు నాలాలపై దృష్టి
వరంగల్ నగరంలో చాలాచోట్ల ఇరుకు నాలాలే కాలనీలను ముంచెత్తుతున్నాయి. తిరుమల జంక్షన్, గోకుల్ నగర్, హనుమకొండ చౌరస్తా, వరంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో నాలాలపై ఎక్కడికక్కడ స్లాబులు వేయడం కూడా సమస్యగా మారింది. దీంతో ఇరుకు నాలాలు, స్లాబుల వల్ల ముంపు సమస్య ఏర్పడే చోట తాత్కాలిక చర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జీడబ్ల్యూఎంసీ పరిధిలోని డీఆర్ఎఫ్ సిబ్బందితో పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండగా.. వరద ముప్పు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.