- గత 12 రోజులుగా ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు
- ఓటర్ల ప్రలోభాలకు తెర
- ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, పది మున్సిపాలిటీల్లో ఎన్నికలు
ఆదిలాబాద్/మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ర్యాలీలు, సభలు బంద్ అయ్యాయి. వార్డుల్లో మైకులు మూగబోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో జనవరి 28న నామినేషన్ల స్వీకరణ మొదలు సోమవారం ప్రచార గడువు ముగిసే వరకు అభ్యర్థులు తిరం లేకుండా తిరిగిండ్రు. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు పది మున్సిపాలిటీలు ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, లక్సెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో 11న ఎన్నికలు జరగనున్నాయి.
అధికార కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థులు ప్రచారంలో తీవ్రంగా కష్టపడ్డారు. జిల్లా నేతలో పాటు రాష్ట్ర స్థాయి నేతలు ఎన్నికల ప్రచారాని పట్టణాలకు తరలివచ్చి పట్టణాల్లోనే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణాల్లో ప్రచార రథాలు, ర్యాలీలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాన పార్టీలతో పాటు రెబల్స్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనసేన, ఇండిపెండెంట్లు బరిలో ఉండటంతో గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.
ఓటుకు వెయ్యి నుంచి రూ.3 వేలు
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార ఘట్టం ముగియడంతో ఇక ఓటర్లను ప్రలోభపర్చుకునేందుకు నేతలు పంపకాలకు తెరలేపారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని ఒక్కో వార్డుల్లో ఓటర్లకు రూ.2 వేల నుంచి రూ. 5 వేల వరకు నేతలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం పంపకాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టబడుతోంది. మంచిర్యాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుండడంతో మూడు పార్టీల అభ్యర్థులు ఓటుకు వెయ్యి చొప్పున పంచుతున్నట్టు తెలిసింది.
కొన్ని డివిజన్లలో పోటాపోటీగా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. మున్సిపాలిటీల్లోనూ ఓటుకు రూ.వెయ్యి, ఆపైనే రేటు పలుకుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే కొన్ని చోట్ల మహిళలకు చీరలు, పురుషులకు మద్యం బాటిళ్లు పంచుతున్నారు. ఎన్నికల్లో నగదు, కానుకల పంపిణీని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఆగడం లేదు.
