ఓటర్లకు తాయిలాలు.! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముగిసిన ప్రచారం 

ఓటర్లకు తాయిలాలు.! ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ముగిసిన ప్రచారం 
  • మందు, బిర్యానీ కామన్‍.. ఓటుకు నోటు ఇచ్చేలా నేతలు ప్లాన్‍
  • పలుచోట్ల ఓటుకు రూ.2 నుంచి 5 వేలు ఇచ్చేందుకు రెడీ
  • జిల్లాకొచ్చివెళ్లిన సీఎం రేవంత్‍రెడ్డి, కేటీఆర్‍, ఈటల, నారాయణ
  • రేపే మున్సిపల్‍ ఎలక్షన్‍., ఏర్పాట్లలో అధికారుల బిజీ

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. నేతలంతా ఇప్పుడు ఓటర్లను ప్రలోభపరిచే పనిలో పడ్డారు. ''వార్డులో ఎన్ని ఓట్లున్నయ్‍.. ఏ సామాజికవర్గం ఓటర్లు ఎందరున్నరు. ఎవరిని పట్టుకుంటే గంపగుత్తగా ఓట్లు పడతయ్‍. ఎదుటివ్యక్తి ఓటుకు ఎంతిస్తున్నడు.

పోటీ ఆధారంగా ఒక్కో ఓటుకు ఎంత పంపిణీ చేస్తే బయటపడతం. మొత్తంగా ఓటుకు నోటు ఇచ్చే క్రమంలో ఎంత ఖర్చు అవుతుందనే” అంశంలో అటు ప్రధాన పార్టీ లీడర్లు, మరోవైపు కౌన్సిలర్‍ బరిలో ఉన్న క్యాండిడేట్లు లెక్కలు కడుతున్నారు. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా, ప్రలోభాలతో రేపటి ఎలక్షన్లకు నేతలు రెడీ అవుతున్నారు. ఎన్నికల అధికారులు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమవగా, పోలీస్‍ పెద్దలు ఎన్నికలు జరిగేచోట బందోబస్త్​ పెట్టి ఈసీ రూల్స్​ ఫాలో కావాలని చెబుతున్నారు. 

12 మున్సిపాలిటీలు.. 260 వార్డులు 

ఉమ్మడి వరంగల్​లో గత ఎన్నికల్లో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూరు, డోర్నకల్‍, మరిపెడ, మహబూబాబాద్‍తో కలిపి 9 మున్సిపాలిటీలు ఉండగా, ఈసారి స్టేషన్‍ ఘన్‍పూర్‍, ములుగు, కేసముద్రం కలిపి మొత్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో 200 డివిజన్లు ఉండగా, ఇప్పుడు వార్డుల సంఖ్య 260కి పెరిగింది. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్‍ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, అత్యల్పంగా వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి.

ప్రధాన నేతల హోరాహోరీ ప్రచారం..

అధికార కాంగ్రెస్‍ పార్టీ గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‍ మొదలు మొన్నటి సర్పంచ్‍ ఎన్నికల వరకు జైత్రయాత్ర కొనసాగుతుండటంతో మరోసారి అవే ఫలితాలపై దృష్టి పెట్టింది. సీఎం రేవంత్‍రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, పొన్నం ప్రభాకర్‍తో పాటు స్థానిక మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, లోకల్‍ ఎమ్మెల్యేలు ప్రచారంలో తలమునకలయ్యారు. వరుస ఎన్నికల పరాజయాల నుంచి బయటపడేందుకు ఈసారి బీఆర్‍ఎస్‍ సైతం మున్సిపాలిటీ ఎన్నికలపై ఫోకస్‍ పెట్టారు.

ఆ పార్టీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ దాదాపు అన్ని మున్సిపాలిటీలను చుట్టేయగా, నేతలు ఆర్‍ఎస్‍ ప్రవీణ్‍కుమార్‍, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదల్లేదు. బీజేపీ తరఫున ఎంపీ ఈటల రాజేందర్‍, సీపీఐ నుంచి సీనియర్‍ నేత నారాయణ, బీసీ అభ్యర్థుల కోసం ఎమ్మెల్సీ తీన్మార్‍ మల్లన్న ప్రచారం చేసి వెళ్లారు. 

ఆఫీసర్ల ఏర్పాట్లు.. పోలీసుల బందోబస్త్..​

మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు నిర్వహించే క్రమంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కావాల్సిన ఏర్పాట్లు చేపట్టారు. మున్సిపాలిటీల సంఖ్య ఆధారంగా ఒక్కో ఎన్నిక జరిగేచోట 40 నుంచి 50 మంది ప్రిసైడింగ్‍, మరో 4‌‌ 0 మంది అసిస్టెంట్‍ ప్రిసైడింగ్‍ ఆఫీసర్లు, 120 నుంచి 150 మంది వరకు ఇతర పోలింగ్‍ అధికారులను నియమించారు. మరో 17 మందిని సూక్ష్మ మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

రెండు, మూడు మున్సిపాలిటీలు ఉన్నచోట అంతేస్థాయిలో అధికారులను పెంచారు. భద్రత, బందోబస్త్​ చర్యల్లో భాగంగా వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, జనగామ, స్టేషన్‍ ఘన్‍పూర్‍ మున్సిపాలిటీల్లో ఈసీ నిబంధనల మేరకు బందోబస్త్​ నిర్వహిస్తున్నట్లు సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపారు. ఉత్తర్వులు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

లిక్కర్ షాప్స్ క్లోజ్.. 

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసివేయించనున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని చెప్పారు. కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలులో ఉంటుందన్నారు.

బీరు, బిర్యానీ.. ఓటుకు రూ.5 వేలు.!

మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‍తో మొదలైన బీరు, బిర్యానీ పంపిణీ ఎన్నికల ప్రచారం వచ్చేసరికి చికెన్‍, మటన్‍ కూడా కామన్‍ అయింది. సోమవారం సాయంత్రం ప్రచార ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలు, అభ్యర్థులు లెక్కలు వేస్తూ నమ్మకస్తుల ద్వారా గంపగుత్త ఓట్ల కోసం నోట్లు పంపిస్తున్నారు. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, తొర్రూరు వంటి జనరల్‍ రిజర్వేషన్‍ ఉన్నచోట ఓటర్లకు డిమాండ్‍ పెరిగింది. తక్కువల్లో తక్కువ ఓటుకు రూ.1000 నుంచి 1500 నడుస్తుండగా, సవాల్‍ అనుకునే కొన్ని వార్డుల్లో రూ.2 వేల నుంచి రూ.5 వేలు సైతం ఇచ్చేలా తమ అనుచరుల ద్వారా ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు.