- ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐదు కౌంటింగ్ సెంటర్లు
- రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు
- 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ 400 వార్డులకు జరిగిన ఎన్నికలు
- ప్రధాన పార్టీలతో కలిపి పోటీ చేసిన అభ్యర్థులు
- మొత్తం 1737 మంది స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్తు
నల్గొండ/యాదాద్రి, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉమ్మడి జిల్లాలోని17 మున్సిపాలిటీలు, నల్గొండ కార్పొరేషన్ కలిపి 400 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, రిజిస్టర్ పార్టీల క్యాండిడేట్లతో కలిపి మొత్తం 1737 మంది పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్కేంద్రాల్లో జరగనుంది. ఉదయం 8 గంటల నుం చి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మొదట అన్ని వార్డుల్లోని పోస్టల్ బ్యాలెట్ఓట్లను లెక్కిస్తారు.
అనంతరం బ్యాలెట్బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.
నల్గొండ జిల్లాలో
నల్గొండ ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు, మిర్యాలగూడ అవంతిపురం మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు, నల్గొండ సమీపంలో ఉన్న నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో దేవరకొండ, చండూరు చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మొత్తం 2, 40,514 ఓట్లు పోలవ్వగా ప్రతి వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, ఇద్దరు సూపర్‌వైజర్లు, ఆర్ఓలు ఉంటారు. నల్గొండ కార్పొరేషన్ లో 48 వార్డులకు 48 టేబుళ్లు, మిర్యాలగుడ సంబంధించి 2 కౌంటింగ్ హాల్స్ లో 49 టేబుల్స్ ఏర్పాటు చేశారు. హాలియా మున్సిపాలిటీ సంబంధించి 11 టేబుల్స్, నందికొండ మున్సిపాలిటీలో 12 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు.
మొత్తం ఒకే రౌండ్లో లెక్కింపు అవుతుంది. చిట్యాల మున్సిపాలిటీ చెందిన 12 వార్డులకుగాను 12 టేబుల్స్, దేవరకొండ మున్సిపాలిటీ కౌంటింగ్ కి సంబంధించి 20 వార్డులకు గాను20 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
సూర్యాపేట జిల్లాలో 137 టేబుళ్లు
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో మొత్తం 2,19,972 ఓట్లకు 1,75, 759ఓట్లు పొలవ్వగా ప్రతి మున్సిపాలిటీలో వార్డుకి 1 టేబుల్ చొప్పున 137 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకటే రౌండ్ లో ఫలితాలు వచ్చేలా చేశారు. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ లో అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సూర్యాపేటలో 48 వార్డులకు 48 టేబుల్స్ ఏర్పాటు చేయగా కోదాడ 32 వార్డులకు 32 టేబుల్స్ ఏర్పాటు చేసి రెండు రౌండ్లుగా కౌంటింగ్ నిర్వహించనున్నారు. హుజూర్ నగర్ 27 టేబుల్స్, నేరేడు చర్ల మున్సిపాలిటీ 15 వార్డులకు 15 టేబుల్స్, తిరుమలగిరిలో 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
యాదాద్రి జిల్లాలో 31 టేబుల్స్, 9 రౌండ్లు
యాదాద్రి జిల్లాలోని భువనగిరి ,ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కుర్ మున్సిపాలిటీలోని 102 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కోసం భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాట్లు చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు ఉండడంతో తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేశారు.
చౌటుప్పల్లో 19 వార్డులకు 6 టేబుల్స్, ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, యాదిగిరిగుట్ట మున్సిపాలిటీలకు 4 టేబుల్స్ చొప్పున 31 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా 39 మంది కౌంటింగ్ సూపర్ వై జర్స్, 78 మంది అసిస్టెంట్లను నియమించారు.
