- గెలుపు గుర్రాలపై ప్రధాన పార్టీల ఫోకస్
- నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు
- నడిగడ్డలో త్రిముఖ పోటీ
గద్వాల, వెలుగు: మున్సిపల్ చైర్మన్లు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పట్టణాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఇప్పటివరకు ఏ వార్డు ఎవరికి రిజర్వ్ అవుతుందోననే టెన్షన్‌తో ఉన్న ఆశావహులు రిజర్వేషన్లు ఖరారు కావడంతో టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. వార్డుల వారీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు, వారి గెలుపోటములపై ప్రభావం చూపే అంశాలను బేరీజు వేసుకుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ పార్టీ లీడర్లు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు. యువ ఓటర్లకు గాలం వేసేందుకు వార్డుల్లో ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు.
సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించి, ఖర్చులను వార్డు లీడర్లు భరించారు. నడిగడ్డలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్ ను సిద్ధం చేసింది. బీజేపీ నాయకులు కూడా ప్రతిరోజు మీటింగ్ లు పెట్టుకుంటూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు
జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గద్వాలలో 37 వార్డులు, అయిజలో 20 వార్డులు, అలంపూర్ లో 10, వడ్డేపల్లిలో 10 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల వివిధ పార్టీల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులు వార్డులో ప్రభావం చూపే ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కుల సంఘాలు, యూత్ లీడర్లను కలిసి తమకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నారు. గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేయడంతో పాటు నజరానాలు పంపిణీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
బరిలో మూడు పార్టీలు..
జోగులాంబ గద్వాల జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్వాల మున్సిపాలిటీలో మూడు పార్టీలు బలంగా ఉండడంతో ఎక్కువ స్థానాలు గెలుపొంది చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అందరూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, ఆలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో కూడా పోరు రసవత్తరంగా మారనుంది.
ప్రతి వార్డుకూ ముగ్గురి పేర్లు..
వార్డుల్లో పోటీ చేసేందుకు ప్రతి వార్డుకు ముగ్గురిని ఎంపిక చేసి వారి పేర్లను హైకమాండ్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లోకల్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా హైకమాండ్ ఎంపిక చేసేలా చూస్తున్నారు. వార్డుల్లో గెలిచే అభ్యర్థులకే పార్టీ టికెట్ ఇచ్చేలా వ్యూహాత్మకంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వార్డుల్లో ఏ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయంతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను నిలబెట్టేందుకు మూడు పార్టీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి.
