వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ మధ్య పోటీ
  • తమ శ్రేణులతో విప్ ఆది శ్రీనివాస్, కేంద్ర మంత్రి సంజయ్, 
  • ఎమ్మెల్యే  కేటీఆర్​ మంతనాలు
  • గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
  • రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 1న మున్సిపల్ కార్యాలయాల్లో ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. అభ్యంతరాలుంటే తెలపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, ధార్మిక క్షేత్రమైన వేములవాడ బల్దియాల్లో రాజకీయం వేడెక్కింది. 

ఎన్నికల వ్యూహాలపై చర్చలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీలపై పార్టీ జెండా ఎగురవేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ వ్యూహాలు రచిస్తున్నాయి. కాంగ్రెస్​ తరఫున ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్​తమ పార్టీల శ్రేణులతో మంతనాలు జరుపుతున్నారు. గత డిసెంబర్ 31న  కేటీఆర్ సిరిసిల్ల తెలంగాణ భవన్​లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల బీఆర్ఎస్ నాయకులతో సమావేశమై ఎన్నికలపై చర్చించారు.

 సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీ ఓట్లు ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీంను అమలు చేయాలని, లేదంటే మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర మంత్రి సంజయ్​ఈ నెల 1న సిరిసిల్ల శాంతినగర్ లోని ఓ బీజేపీ కార్యకర్త ఇంట్లో మీటింగ్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల, వేములవాడ బల్దియాలపై ఎలాగైనా కాంగ్రెస్​జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ముందుకుసాగుతున్నారు.

సిరిసిల్లలో 39, వేములవాడలో 29 వార్డులు

మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. సిరిసిల్లలో 39, వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులున్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో గత టర్మ్ చైర్మన్ ​సీటు మహిళలకే దక్కింది. ఈసారి ఏ రిజర్వేషన్ వస్తుందోననే ఉత్కంఠ ఆశావాహుల్లో నెలకొంది. ప్రస్తుతం మహిళ, జనరల్ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాల కేటాయింపులో రొటేషన్ పద్ధతి అమలు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో అన్ రిజర్వ్​డ్ స్థానాల్లో సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు గెలిచారు. ఒకవేళ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసిరాకపోతే జనరల్ స్థానాల్లో పోటీ చేసేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్లు సమాయత్తం అవుతున్నారు.