మున్సిపోల్స్ తర్వాతే బడ్జెట్

మున్సిపోల్స్ తర్వాతే బడ్జెట్
  • భారీగా పెరిగిన ఖర్చులు.. ఆదాయం అంతంతే
  • కేంద్రం నుంచి నిధులు కట్​
  • బిల్లులు పెండింగ్​.. పథకాలకు నిధుల కటకట​

హైదరాబాద్, వెలుగు:వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో లోక్​సభ ఎలక్షన్ల సమయం కావడంతో పూర్తిస్థాయి బడ్జెట్​ పెట్టలేదు. కేంద్రం నుంచి ఎన్ని నిధులొస్తాయనే స్పష్టత లేని కారణంగా ఫిబ్రవరి 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్​ ప్రవేశపెట్టారు. నాలుగు నెలలుగా అదే తాత్కాలిక బడ్జెట్​తో ఫైనాన్షియల్​ మేనేజ్​మెంట్​ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత రావడంతో.. పూర్తిస్థాయి బడ్జెట్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అన్ని విభాగాల నుంచి ఆదాయం, అవసరమైన నిధుల ప్రతిపాదనలను స్వీకరిస్తోంది. ఈ నెల 14 లోగా ప్రపోజల్స్​ను పంపాలని ఆర్థికశాఖ ఆదేశించింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రపోజల్స్​తోపాటు, నిరుటి బడ్జెట్​కు సంబంధించిన సవరణ లెక్కలను కూడా పంపాలని సూచించింది.

ఈ నెలలోనే ఎలక్షన్లు

రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ల ప్రక్రియను ఈ నెలలోనే పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని మున్సిపాలిటీల్లో ఎలక్షన్లపై కోర్టు స్టే విధించింది కూడా. అయితే కోర్టు ఈ నెల 13న విచారణ పూర్తిచేసి తుది తీర్పు ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దాంతోపాటు కోర్టు పరిధిలో లేని 69 మున్సిపాలిటీల్లో ఎలక్షన్లు నిర్వహించేందుకుఏర్పాట్లు మొదలుపెట్టింది. దీంతో ఈ ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ సారీ లోటే..

ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.1,82,017 కోట్లతో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయి బడ్జెట్​ కూడా ఇంచుమించుగా అదే స్థాయిలో ఉంటుందని, పెద్దగా మార్పులు చేర్పులుండే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలు ఇప్పటికే పూర్తవడంతో ఆదాయ వ్యయాలపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. ఏప్రిల్​ నుంచి జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం కాగ్​కు సమర్పించిన నివేదికల ప్రకారం.. మూడు నెలల్లో రాష్ట్ర ఆదాయం రూ.19,005 కోట్లుకాగా.. ఖర్చు రూ.23,565 కోట్లు. లోటు రూ.6,319 కోట్లు. ఈ లెక్కన పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయం రూ.లక్ష కోట్లు దాటే అవకాశం లేదని, కేంద్ర గ్రాంట్లు, రుణాలన్నీ కలిపినా ఓటాన్​ అకౌంట్​లో చూపిన దానికన్నా తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఆర్థిక సంవత్సరం దాదాపు సగం గడిచిపోనుంది. దీంతో వాస్తవ ఆదాయ వ్యయాలకు అనుగుణంగా పూర్తి స్థాయి బడ్జెట్​ పెట్టుకునే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ నుంచి అనుకున్నన్ని పైసలు రాలే..

కేంద్రం నుంచి వచ్చే నిధులు బడ్జెట్​పై ఎఫెక్ట్​ చూపించనున్నాయి. ఈ ఏడాది కేంద్రం నుంచి రూ. 43,418.34 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో అంచనా వేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్​ ప్రకారం రాష్ట్రానికి రూ.32,632 కోట్లు మాత్రమే రానున్నట్టు తేలింది. దీంతో రాష్ట్ర సర్కారు అంచనాలు తప్పిపోయాయి. రూ.10,785 కోట్ల మేర కోత పడింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్​పై ఎఫెక్ట్ తప్పదు. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు కేంద్రం నుంచి కేవలం రూ.3,622 కోట్లు మాత్రమే విడుదలవడం గమనార్హం.

చానా బిల్లులు పెండింగే..

రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా ఎన్నికలప్పడు ఇచ్చిన హామీలు ఇప్పుడు భారంగా మారాయి. ప్రభుత్వ పథకాలు, పనులకు నిధుల కటకట ఎదురవుతోంది. ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయించిన సర్కారు.. ఇప్పటివరకు ఆ పథకంపై కసరత్తు కూడా మొదలు పెట్టలేదు. నిరుడు డిసెంబర్​ నాటికి ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని సర్కారు చెప్పింది. కానీ ఇప్పటికీ దానిపై స్పష్టత లేదు, మార్గదర్శకాలు ఖరారు చేయలేదు, నిధులు విడుదల చేయలేదు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం అందించే ‘రైతుబంధు’కు నిధుల కొరత ఎదురైంది. ఖరీఫ్​లో రూ.6 వేల కోట్లు అవసరంకాగా.. ఇప్పటికి రూ.4 వేల కోట్లు కూడా పంపిణీ కాలేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించటం లేదని ప్రైవేటు హాస్పిటళ్లు సమ్మె నోటీసు జారీ చేసేదాకా వచ్చింది. ఇప్పటికే పూర్తయిన పనులు, అమలవుతున్న పథకాల్లో పెండింగ్​ బిల్లులు భారీగా పేరుకుపోయాయి. వీటికి తోడు రెండింతలు పెరిగిన ఆసరా పింఛన్ల బడ్జెట్, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు, విద్యుత్​ సంస్థలు, ఆర్టీసీ, సివిల్​ సప్లైస్​ కార్పొరేషన్లకు చెల్లించాల్సిన సబ్సిడీలు అన్నీ పెండింగ్​లో ఉన్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల గ్రాంట్లను పీడీ ఖాతాలకు మళ్లించిన నేపథ్యంలో ఇప్పుడా నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ తంటాలు పడుతోంది.

అప్పుల మీద అప్పులు

ఈ ఏడాది వచ్చే ఆదాయంపై సర్కారు భారీగా అంచనాలు వేసుకుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపైనా ఆశలు పెట్టుకుంది. కానీ అనుకున్నంత ఆదాయం రాకపోవడం, కేంద్రం నుంచి అంచనా వేసిన దానికంటే తక్కువగా నిధులొచ్చేలా ఉండటంతో ఇబ్బందిగా మారింది. సంక్షేమ పథకాల ఖర్చు భారీగా పెరగడం ఖజానాకు భారంగా మారింది.  అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.69,517 కోట్లుగా ఉన్న అప్పులు.. గతేడాది చివరినాటికి రూ.1.80 లక్షల కోట్లు దాటాయి. గత నాలుగు నెలల్లో సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్​బీఐ నుంచి రూ.9,500 కోట్ల అప్పు తెచ్చారు. కార్పొరేషన్ల పేరిట తెచ్చిన అప్పులు అదనం. డబుల్​ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల కోసం30 వేల కోట్లకుపైగా రుణాలు తెచ్చారు. తెచ్చిన అప్పుల ఇన్​స్టాల్​మెంట్లు, వడ్డీల కోసమే ఈ ఏడాది బడ్జెట్​లో రూ.9 వేల కోట్లు కేటాయించారు కూడా.

పెండింగ్ బిల్లులు

 డిపార్ట్​మెంట్​                                                        బకాయి(రూ.కోట్లలో)

విద్యుత్​ సంస్థలకు                                                   15,000

ఇరిగేషన్​                                                               9,100

మిషన్​ కాకతీయ                                                    1,200

మిషన్​ భగీరథ                                                        9,000

రైతు బంధు                                                           2,000

రీయింబర్స్ మెంట్, మెస్​ బిల్లులు                               1,000

ఆరోగ్యశ్రీ                                                                1,300

ఆర్​ అండ్​ బీ                                                           6,000

పంచాయతీరాజ్​                                                      230

కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థలు                             800

కల్యాణలక్ష్మి,
షాదీ ముబారక్, కేసీఆర్​ కిట్లు​                                     150

సబ్సిడీ ట్రాక్టర్లు, పాలీ హౌజ్​లు                                    200