IND VS ENG 2025: ఇంగ్లాండ్ బిగ్ స్కెచ్.. టీమిండియాను బోల్తా కొట్టించడానికి గ్రీన్ పిచ్

IND VS ENG 2025: ఇంగ్లాండ్ బిగ్ స్కెచ్.. టీమిండియాను బోల్తా కొట్టించడానికి గ్రీన్ పిచ్

ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం (జూలై 10) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. లండన్ వేదికగా ప్రతిష్టాత్మక ఐకానిక్ లార్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఎడ్జ్‌బాస్ట‌న్ టెస్టులో గెలిచి ఇంగ్లండ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా అదే ఊపును మూడో టెస్టులోనూ కొనసాగించాలని కోరుకుంటుంది. రెండో టెస్టుకు దూరమైన బుమ్రా తిరిగి రావడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో గ్రీన్ పిచ్ తయారు చేసి  ఏకంగా నలుగురు స్పెషలిస్ట్ సీమర్లతో బరిలోకి దిగనున్నట్టు సమాచారం. 

రెండో టెస్టులో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ మూడో టెస్ట్ కోసం గట్టి ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లార్డ్స్ టెస్ట్ కోసం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే గ్రీన్ పిచ్ తయారు చేస్తున్నట్టు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో ఫ్లాట్ వికెట్లు తయారు చేసిన ఇంగ్లాండ్ భారత బ్యాటర్లను ఆపడంలో విఫలమయ్యారు. దీంతో మూడో టెస్టుకు మాత్రం బౌలింగ్ పైనే దృష్టి పెట్టింది. క్యూరేటర్లు గ్రీన్ పిచ్  తయారు చేసి ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా పిచ్ ను మారుస్తున్నారు. ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ రిక్వెస్ట్ చేయడంతో క్యూరేటర్లు పేస్‌ బౌలింగ్‌కు సరిపోయే వికెట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

►ALSO READ | Wimbledon 2025: ఈ సారి ఫైనల్‌కు ఆ ఇద్దరూ రావాలి.. కానీ అతడే గెలవాలి: విరాట్ కోహ్లీ

పిచ్‌పై ఎక్కువగా గ్రాస్‌ను ఉంచినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండడంతో ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ కు పెద్ద పరీక్ష ఎదురు కానుంది. ఒకవేళ గ్రీన్ పిచ్ అయితే టీమిండియా సైతం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. సుందర్ స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, బుమ్రా లు భారత ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటారు. రెండో టెస్టులో బాగా ఆడినప్పటికీ.. పిచ్ ను దృష్టిలో పెట్టుకొని సుందర్ పై వేటు పడక తప్పదు.