నవంబర్​ నెలాఖరులోపు మున్సి‘పోల్స్’​

నవంబర్​ నెలాఖరులోపు  మున్సి‘పోల్స్’​
  • వీఆర్వోలను తీసేస్తమన్న భ్రమలో ఉన్నరు
  • దీపావళి తర్వాత గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు పోత: సీఎం

హైదరాబాద్​, వెలుగు:

నవంబర్​ నెలాఖరులోపు మున్సిపల్ ఎన్నికలు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంకా కొన్ని కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. వాటిపై తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీర్పు రాగానే రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వస్తుందని చెప్పారు. కేసుల కారణంగా అనుకున్న దానికంటే  రెండు నెలల పాటు ఎన్నికలు ఆలస్యమవుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే గ్రామాల అభివృద్ది కోసం ఏర్పాటు చేసినట్టుగానే  పట్టణాల కోసం కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 141 మున్సిపాల్టీల కోసం ప్రభుత్వం వద్ద రూ. 2060 కోట్ల నిధులు ఉన్నాయని, కొత్త పాలక మండళ్లు రాగానే వాటి ద్వారా ఖర్చు చేస్తామని ఆయన అన్నారు.

నిరుద్యోగ భృతి కోసం స్డడీ చేయాలి

ఎన్నికల హామీల్లో భాగంగా తాము నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పినట్లు కేసీఆర్  గుర్తుచేశారు. ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. అయితే ఎవరూ నిరుద్యోగులు, ఎవరూ కాదో తేల్చేందుకు స్టడీ చేస్తామని చెప్పారు.

గల్ఫ్‌‌ పోయి మనోళ్లతో మాట్లాడతా

గల్ఫ్‌‌‌‌‌‌‌‌లో మనోళ్లు చేసే పనులే ఉత్తరప్రదేశోళ్లు, బిహారోళ్లు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో చేస్తున్నారని సీఎం కేసీఆర్​ అన్నారు. దీపావళి తర్వాత తానే స్వయంగా గల్ఫ్‌‌‌‌‌‌‌‌కు పోయి మనోళ్లందరితో మాట్లాడి ఇక్కడికి రావాలని కోరుతానని చెప్పారు.

మాకే జాగలు లేవు.. జర్నలిస్టులకు ఎట్లా

‘‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే స్థలాలు లేవు. ఇక జర్నలిస్టులకు ఎక్కడ్నించి ఇవ్వాలి”అని కేసీఆర్ తనంతటగా తానే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి స్పందించారు. అయితే కోర్టులో కేసు ఉందని, తీర్పు రాగానే జర్నలిస్టుల కోసం మంచి స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. ఏడాదిలోపు స్థలాలు ఇస్తానని అన్నారు. టెంపరరీ సెక్రటేరియట్ బీఆర్కే భవన్ లోకి మీడియాకు అనుమతి ఉంటుందని తెలిపారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రెండు క్వార్టర్స్ కేటాయించి అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ఆదేశించారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో టికెట్ అడిగారు

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే విషయం ఏమైందని మీడియా ప్రశ్నించగా.. ‘‘తెలంగాణకు అనుకోని ఉన్న మహారాష్ట్రకు చెందిన నాందేడ్, చంద్రపూర్ జిల్లాల నుంచి కొందరు నాయకులు వచ్చారు. వారు టీఆర్ఎస్ టికెట్ ఇస్తే పోటీ చేస్తామని అన్నారు. వారికి టికెట్ మేం ఇవ్వలేదు. భవిష్యత్ లో చూద్దామని చెప్పాం” అని సీఎం తెలిపారు.

అవసరం లేకపోతే తొలగిస్తం

త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని సీఎం చెప్పారు. ‘‘రెవెన్యూ వ్యవస్థను ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు. అయితే కొందరు వీర్వోలను తీసేస్తారా అని విమర్శిస్తున్నారు. ఏం చేయాలో ఇంకా నిర్ణయం కాలేదు. ’’ అని కేసీఆర్ అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో లంచం అనేది ఉండకూడదనేది ప్రభుత్వం ఉద్దేశమని చెప్పారు. ‘‘రెవెన్యూ ఉద్యోగులు పిచ్చిగా ఆలోచించుకుంటున్నరు. తీసేస్తమని భ్రమల్లో పోతున్నరు. ఎవడో చెప్తే వింటున్నరు. మేమే ఇంకా ఫైనల్​కు రాలేదు. క్లీన్​గా ఉండాలె వ్యవహారం అనేది మా ఆలోచన. ఒకవేళ వీఆర్వోల అవసరం లేకపోతే తీసేస్తాం. ఈ వీఆర్వోలు ఏడికెంచి వచ్చిండ్రు. పటేల్​ పట్వారీని తీసేస్తే వీళ్లు వచ్చిండ్రు.

ఏం పాతుకొని కూర్చున్నమా ఈడ. ప్రభుత్వం వద్దనుకుంటే పక్కకు జరగాలె. మేమే కర్తలం, భర్తలమంటే నడుస్తదా? ప్రజలు వద్దనుకుంటే ముఖ్యమంత్రినే పీకిపారెస్తరు. మీ వీఆర్వోలను తీసేస్తే ఉద్యోగం తీసేయరు కదా.. ఎక్కడో అడ్జస్ట్​ చేస్తం. తీసేసే నిర్ణయం జరగలేదు” అని స్పష్టం చేశారు.

Municipal Elections before the end of November says CM KCR