ప్రారంభమైన కౌంటింగ్

ప్రారంభమైన కౌంటింగ్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ముందుగా సర్వీస్ ఓట్లు లెక్కపెట్టి..తర్వాత బ్యాలెట్ ఓట్లు కౌంట్ చేస్తారు.  రాష్ట్రంలోని  120 మున్సిపాల్టీలు,  9 కార్పొరేషన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది.  మొత్తం 12 వేల 898 మంది  అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో  తేలనుంది. చాలాచోట్ల మధ్యాహ్నం  వరకే ఫలితాలు వచ్చే  అవకాశం ఉంది. కార్పొరేషన్లు, పెద్ద మున్సిపాల్టీల్లో  ఓట్ల లెక్కింపు  కొంత ఆలస్యమయ్యే  చాన్స్ ఉంది.

మున్సిపాల్టీలో ప్రతీ వార్డుకు  రెండు పోలింగ్  బూతులున్నాయి. ఒక్కో వార్డుకు  సంబంధించిన ఓట్లను ఒకేచోటే కలిపి బండిళ్లుగా కడతారు. ఇందుకోసం గంట టైమ్ పడుతుందని తెలుస్తోంది. తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను విడదీసి లెక్కిస్తారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 వందల ఓట్లు పోలై ఉంటే..లెక్కించేందుకు మూడు గంటల సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. అంతకంటే  తక్కువుంటే రెండు గంటల్లోనే కౌంటింగ్ పూర్తవుతుంది. ఓట్ల కౌంటింగ్ లో ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్,  ఇద్దరు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతీ మూడు టేబుళ్లను ఒక రిటర్నింగ్  ఆఫీసర్, అసిస్టెంట్  రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. వార్డుల వారీగా  లెక్కింపు పూర్తయ్యే  కొద్దీ ఫలితాలను ప్రకటిస్తారు.

120 మున్సిపాల్టీల్లోని  2 వేల 647  వార్డులు, కార్పొరేషన్లలోని  324 డివిజన్లలో  మొత్తం 12 వేల 898  మంది అభ్యర్థులు  భవితవ్యం కొన్ని గంటల్లో  తేలిపోనుంది.  కౌంటింగ్ కోసం  మొత్తం 13 వందల  70 టీములు పనిచేస్తున్నాయి. 2 వేల 958 మంది సూపర్ వైజర్లు, మరో 4 వేల 756  మంది అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. 24 వార్డులు అంతకంటే ఎక్కువగా ఉన్న మున్సిపాల్టీల్లో  వార్డుకు ఒక టేబుల్,  తక్కువున్న  చోట  రెండు వార్డులకో టేబుల్  చొప్పున ఏర్పాటు చేసి..ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఈవీఎంలతో  కాకుండా బ్యాలెట్  పేపర్లతో పోలింగ్ నిర్వహించడంతో ఫలితాలు కాస్త ఆలస్యం కానుంది.

రాష్ట్రంలో కొత్తగా  ఏర్పాటైన చండూరు , భూత్పూర్,  అమరచింత, వడ్డేపల్లి మున్సిపాల్టీల్లో 10 వార్డులున్నాయి. వీటితో  పాటు 12 వార్డులే ఉన్న రామాయంపేట,  చేర్యాల, హాలియా,  నందికొండ,  ఆలేరు, యాదగిరిగుట్ట, ఎల్లారెడ్డి వంటి  మున్సిపాల్టీల ఫలితాలు ఉదయం 11, 12 గంటల వరకు తెలిసే చాన్సుంది. ఇక 60  డివిజన్లున్న నిజామాబాద్  కార్పొరేషన్లో కౌంటింగ్ పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుందని చెప్తున్నారు అధికారులు. ఎక్కడైనా ఇద్దరు  అభ్యర్థులకు  సమానంగా ఓట్లు  వస్తే వారి సమక్షంలోనే  డ్రా తీసి  విజేతను ప్రకటిస్తారు.

see also: ఎవరికి పట్టం కట్టారో..?

ఓట్లు సమానంగా వస్తే..

వారికి రూ.9లక్షల ఫైన్