వచ్చే నెల 22న మున్సి‘పోల్స్’

వచ్చే నెల 22న మున్సి‘పోల్స్’

మున్సిపల్‌‌ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. 120 మున్సిపాలిటీలకు, 10 కార్పొరేషన్లకు జనవరి 22న పోలింగ్‌‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ ప్రకటించింది. అదే నెల 25న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసింది. ఓటర్​ లిస్టు పబ్లికేషన్‌‌కు షెడ్యూల్​ను కూడా ఖరారు చేసింది. ఈ నెల 30 నుంచి జనవరి 4 నాటికి పబ్లికేషన్​ ప్రక్రియను పూర్తి చేయాలని నోటిఫికేషన్‌‌లో పేర్కొంది. ఓటరు ఫైనల్​ లిస్టును ప్రకటించిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్ల ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.జనవరి 6లోగా ఈ ప్రక్రియను ముగించి మరుసటి రోజు ఎన్నికల నోటిఫికేషన్‌‌ జారీ చేస్తారు.

ఇదీ ఎన్నికల షెడ్యూల్​..

120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికకు జనవరి 7న ఎస్‌‌ఈసీ నోటిఫికేషన్‌‌ జారీ చేస్తుంది. అదే నెల 8 నుంచి 10వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల స్క్రూటీని చేసి నిబంధనల మేరకు లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. 12న నామినేషన్లు తిరస్కరించిన వారికి అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు.  13న అప్పీళ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తారు. 15వ తేదీ నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌‌ నిర్వహిస్తారు. ఎక్కడైనా రీ పోలింగ్‌‌ అవసరమైతే జనవరి 24న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 25న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే రిజల్ట్స్‌‌ ప్రకటిస్తారు. రిపబ్లిక్‌‌ డే తర్వాత మేయర్లు, మున్సిపల్‌‌ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌‌ జనవరి నెలాఖరులోపు ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ ఓటర్​ లిస్టు ప్రకటన షెడ్యూల్‌‌..

ఈ నెల 30న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా డ్రాఫ్ట్‌‌ ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 31 నుంచి జనవరి రెండో తేదీ వరకు ఓటర్ల జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. జిల్లా స్థాయి ఎన్నికల అథారిటీగా ఉండే కలెక్టర్లు అదేరోజు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తారు. జనవరి ఒకటిన మున్సిపల్‌‌ ఎలక్షన్‌‌ అథారిటీగా వ్యవహరించే కమిషనర్లు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమవుతారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి జనవరి 3న వాటిని పరిష్కరిస్తారు. జనవరి 4న ఫొటోలతో కూడిన ఫైనల్‌‌ ఎలక్టోరల్‌‌  రోల్స్‌‌ను పబ్లిష్‌‌ చేస్తారు.

ఒకే  విడతలో  పోలింగ్‌‌

కరీంనగర్‌‌, రామగుండం, బడంగ్‌‌పేట్‌‌, మీర్‌‌పేట్‌‌, బండ్లగూడ జాగీర్‌‌, బోడుప్పల్‌‌, ఫీర్జాదిగూడ, జవహర్‌‌నగర్‌‌, నిజాంపేట్‌‌, నిజామాబాద్‌‌ కార్పొరేషన్లతోపాటు 120 మున్సిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌‌ మున్సిపాలిటీ ఎన్నికలు కోర్టు కేసు కారణంగా నిర్వహించడం లేదు. మున్సిపల్‌‌ అధికారులు జహీరాబాద్‌‌కు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధపడి వార్డుల జాబితాను ప్రకటించారు. ప్రీపోల్‌‌ ప్రాసెస్‌‌ చేస్తున్న క్రమంలోనే కోర్టు కేసు ఉండటంతో షెడ్యూల్‌‌ నుంచి ఈ మున్సిపాలిటీని మినహాయించారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా, జనగామ (జనగామ), జయశంకర్‌‌ భూపాలపల్లి (భూపాలపల్లి), కొమ్రంభీం ఆసిఫాబాద్‌‌ (కాగజ్‌‌నగర్‌‌) జిల్లాల్లో అతి తక్కువగా ఒక్కో మున్సిపాలిటీలోనే ఎన్నికలు జరుగనున్నాయి.

ఓటర్ల జాబితా రెడీ

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా వార్డులు/డివిజన్లకు సంబంధించిన ఓటర్ల జాబితా ఇప్పటికే సిద్ధమైంది. ఆదివారం ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు సిబ్బందితో సమావేశమై కొత్త వార్డుల వారీగా ఓటర్ల లిస్టును సిద్ధం చేశారు. పెద్ద కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ సోమవారానికి పూర్తయింది. సోమవారం ఆయా వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 29లోగా పూర్తి చేయాలని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారికంగా జనవరి 4వ తేదీన ఫైనల్‌‌ ఓటర్‌‌ లిస్టును ప్రకటించాల్సి ఉన్నా ఆలోగా ప్రీపోల్‌‌ ప్రాసెస్‌‌ కంప్లీట్‌‌ చేయనున్నారు. ఐదు, ఆరు తేదీల్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. మున్సిపల్‌‌ కమిషనర్లు ఆయా మున్సిపాలిటీల్లో జనరల్‌‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డుల్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వ్‌‌ చేసే ప్రక్రియను ఆరో తేదీన పూర్తి చేస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈ ప్రాసెస్‌‌ కంప్లీట్‌‌ చేస్తారు. అదే రోజు మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో మేయర్‌‌, చైర్మన్‌‌ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. వాటి ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ మున్సిపల్‌‌ ఎన్నికలను నిర్వహిస్తుంది.

జనవరి నెలాఖరులోగా అంతా పూర్తి

మున్సిపల్‌‌ చైర్మన్లు, వైస్‌‌ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కో ఆప్షన్‌‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మున్సిపల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే సమ్మక్క జాతర ఉండటంతో సెక్యూరిటీ, ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే ఎన్నికల ప్రక్రియను ఆలోగా ముగిస్తున్నట్టు తెలిసింది.

సంక్రాంతి నుంచి ప్రచారం

మున్సిపల్‌‌ ఎన్నికల ప్రచారం సరిగ్గా సంక్రాంతి రోజు ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేసిన క్యాండిడేట్లకు ప్రచారం చేసుకునేందుకు ఆరు రోజుల గడువు ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్‌‌ను ఎస్‌‌ఈసీ ప్రకటించడంతో పోటీకి ఆసక్తిచూపుతున్న క్యాండిడేట్లు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టనున్నారు. రిజర్వేషన్లు జనవరి ఐదు, ఆరు తేదీల్లో ఖరారు కానుండటంతో అప్పటి నుంచి ప్రచారం ముగిసే సమయానికి రెండు వారాల గడువు ఉండనుంది.