- ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు
- ఒక్కో వార్డు నుంచి ఆరుగురికిపైగా ఆశావహులు
నల్గొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే ఆశావహులు వార్డుల్లో ప్రచారం షురూ చేశారు. ఈ సారి ఎలాగైనా గెలవాలని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫైనల్ ఓటర్ జాబితా, రిజర్వేషన్లు ఖరారు కావడంతో టికెట్ మాకే ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రెడీ..
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 13 మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. 12 మున్సిపాలిటీల్లో నకిరేకల్ మినహా మిగిలిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను, రిజర్వేషన్లను ప్రకటించడంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆశావహులు వార్డుల్లో ఎక్కువ ఓట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులను మొదలు పెట్టారు. మరో పక్క ప్రధాన పార్టీల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా పోటీ నెలకొనగా ఒక్కో మున్సిపాలిటీలో అర డజన్ కు పైగా ఆశావహులు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా బరిలో నిలవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టగా ఆశావహులు మాత్రం ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు.
ఓటర్ జాబితా ఆధారంగా ..
మున్సిపాలిటీల్లో ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితా ఆధారంగా ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వార్డుల్లో కనీసం రెండువేల మంది ఓటర్లు ఉంటే వాటిలో అనుకూలంగా ఉన్న ఓటర్లే కాకుండా ఇతరులను కూడా కలిసి తమకే మద్దతు ఇవ్వాలని వేడుకుంటున్నారు. దీనికితోడు కులసంఘాల ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఎంత మంది ఓటర్లు ఉన్నారని ఆరా తీయడంతోపాటు సంఘం అధ్యక్షులను ప్రసన్నం చేసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు.
వలస ఓటర్లకు కాల్స్..
మున్సిపాలిటీ ఎన్నికల్లో వలస ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఎక్కువగా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దీంతో వలస ఓటర్లను ఎన్నికల సమయంలో రప్పించేందుకు ఆశావహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ లిస్ట్ లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, వారికి సమీప బంధువులు ఎవరు అంటూ తీస్తూ వారి ఫోన్ నెంబర్లు తెప్పించుకొని కాల్స్ చేస్తూ తమకే ఓటేయాలని కోరుతున్నారు. కొంతమంది ఆశావహులు ఏకంగా తమ మద్దతుదారులను పట్నాలకు పంపించి మరి రహస్య మంతనలను చేస్తూ ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
