పోలింగ్ కు సర్వం సిద్ధం..ఉమ్మడి వరంగల్ లోని 12 మున్సిపాలిటీల్లో 3,35,226 మంది ఓటర్లు 

పోలింగ్ కు సర్వం సిద్ధం..ఉమ్మడి వరంగల్ లోని 12 మున్సిపాలిటీల్లో 3,35,226 మంది ఓటర్లు 
  • ఎక్స్​అఫిషియో మెంబర్లే కింగ్‍ మేకర్లు
  • ఓరుగల్లులో కాంగ్రెస్​ 12, బీఆర్‍ఎస్ 5గురు మెంబర్లు 

వరంగల్‍, వెలుగు:  ఓరుగల్లులో 12  మున్సిపాలిటీల్లో నేడు జరుగనున్న పోలింగ్​కు ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. బందోబస్తు కోసం పోలీసులు రంగంలోకి దిగారు. 12 పురపాలక సంఘాల్లోని 260 వార్డుల్లో దాదాపు 1,070 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 3,35,226 మంది ఓటర్లు ఉన్నారు. ఓరుగల్లు మున్సిపల్‍ వార్‍ ప్రధానంగా కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ మధ్యనే ఉంది. సోమవారం ప్రచారం ముగిసినప్పటినుంచే ప్రలోభాలు మొదలయ్యాయి. చాలా వార్డుల్లో చీరలు, వెండి లాకెట్లు, బీరు, బిర్యానీతోపాటు రూ.2 వేల నుంచి 5 వేలు అందించినట్లు తెలుస్తోంది. 

12 మున్సిపాలిటీల్లో హోరాహోరీ.. 

ఉమ్మడి వరంగల్లో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, జనగామ, తొర్రూర్‍, డోర్నకల్‍, మరిపెడ, మహబూబాబాద్‍, స్టేషన్‍ఘన్‍పూర్‍, ములుగు, కేసముద్రం మొత్తంగా 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్​ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా, అత్యల్పంగా వర్ధన్నపేటలో 12 వార్డులు ఉన్నాయి. జనరల్‍ స్థానాల్లో కాంగ్రెస్‍, బీఆర్‍ఎస్‍ మధ్య టఫ్‍ పోటీ ఉండగా, పలు మున్సిపాలిటీల్లో బీజేపీ క్యాండిడేట్లు సైతం బలమైన పోటీ ఇస్తున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి వంటి పలు స్థానాల్లో ఎదుటివారి గెలుపోటములను శాసిస్తున్నారు. 

హస్తానికి 12 మంది ఎక్స్​ అఫిషియో మెంబర్లు..

మున్సిపాలిటీ ఎలక్షన్లు హోరాహోరీగా సాగుతుండగా, చైర్‍పర్సన్‍ పీఠాలను దక్కించుకోవడంలో ఎక్స్​ అఫీషియో మెంబర్లయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కీలకం కానున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్​లో అధికార పార్టీకి 12 మంది ఉండగా, బీఆర్‍ఎస్‍ పార్టీకి 5 నుంచి 6గురు ఉన్నారు. ఏదైనా మున్సిపాలిటీలో చైర్మన్‍గిరి ఎన్నిక టఫ్‍ ఉంటే ఎక్స్​ అఫిషియో సభ్యులు ఓట్లతో ఫలితాలు మారిపోతాయి.

ఉమ్మడి జిల్లా చూస్తే కాంగ్రెస్‍ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నగర పరిధిలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, మంత్రి కొండా సురేఖ తప్పితే, మిగతా 9 మంది ఎమ్మెల్యేలు వారి పరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్​ అఫిషియో మెంబర్లుగా ఉన్నారు. వరంగల్‍, మహబూబాబాద్‍ ఎంపీలు కడియం కావ్య, బలరాం నాయక్‍ సైతం వారి పార్లమెంట్‍ పరిధిలోని ఏదో ఒక మున్సిపాలిటీలో తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 12 మున్సిపాలిటీల్లో ఎక్కడైనా  ఓటుహక్కు వాడుకోవచ్చు. బీఆర్‍ఎస్‍ లో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, తక్కళ్లపల్లి రవీందర్‍రావు, బండా ప్రకాశ్‍ ఎక్స్​ అఫిషియో ఓటు కలిగి ఉండగా, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‍రెడ్డి ఎమ్మెల్యేగా స్థానికంగా ఓటు వినియోగించుకోవచ్చు. జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఓటును వరంగల్‍ లేదంటే ఖమ్మంలో ఉపయోగించుకోవచ్చు.

పోలింగ్‍ సెంటర్ల బాట పట్టిన సిబ్బంది..

బుధవారం ఎన్నికల నిర్వహణ కోసం  40 నుంచి 50 మంది ప్రిసైడింగ్‍అధికారులు, మరో 4‌‌0 మంది అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్లు, 120 నుంచి 150 మంది వరకు ఇతర పోలింగ్‍ అధికారులు, 17 మందిని మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సిబ్బంది ఓటింగ్‍ కిట్లతో మంగళవారం సాయంత్రమే పోలింగ్‍ సెంటర్లకు చేరారు.

వరంగల్‍ పోలీస్‍ కమిషనరేట్‍ పరిధిలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, జనగామ, స్టేషన్ ఘన్‍పూర్‍ మున్సిపాలిటీల్లో ఈసీ నిబంధనల మేరకు బందోబస్త్​ నిర్వహిస్తున్నట్లు సీపీ సన్‍ప్రీత్‍సింగ్‍ తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం నుంచే లిక్కర్‍ షాపులు మూసివేయించారు. ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లను జిల్లా ఎన్నికల ఆఫీసర్లు, పరిశీలకులు సందర్శించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.