రామగుండంలో చెట్టు నరికివేతతో చెదిరిన గూళ్లు..వందలాది కొంగలు మృత్యువాత

రామగుండంలో చెట్టు నరికివేతతో చెదిరిన గూళ్లు..వందలాది కొంగలు మృత్యువాత
  •  
  • రామగుండంలో భారీ చింతచెట్టును నరికిన బల్దియా సిబ్బంది
  • వందలాది కొంగలు మృత్యువాత, మరికొన్నింటికి గాయాలు

గోదావరిఖని, వెలుగు : రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని అడ్డగుంటపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డుగా ఉన్న ఓ భారీ చింతచెట్టును గురువారం మున్సిపల్‌‌ సిబ్బంది నరికేశారు. దీంతో ఆ చెట్టుపై ఆవాసాలు ఏర్పరచుకున్న వందలాది కొంగలు మృత్యువాతపడగా.. మరికొన్ని గాయపడ్డాయి. కొన్ని కొంగల గూళ్లు చెదిరిపోవడంతో.. అవి నరికేసిన చెట్టు కొమ్మలపైకి చేరాయి. విషయం తెలుసుకున్న జిల్లా పశువైద్యాధికారి శంకర్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన కొంగలకు ట్రీట్‌‌మెంట్‌‌ అందించారు. బతికి ఉన్న కొంగలను ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు పట్టుకొని కొన్నింటిని కరీంనగర్‌‌లోని బర్డ్స్‌‌ సాంక్చురీకి తరలించగా.. మరికొన్నింటిని అడవిలో వదిలేశారు. 

చనిపోయిన కొంగల కళేబరాలను మున్సిపల్‌‌ సిబ్బంది తొలగించారు. ఈ ఘటనపై స్థానిక అడ్వకేట్‌‌ రాజ్‌‌కుమార్‌‌ కలెక్టర్‌‌‌‌కు, గోదావరిఖని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి సతీశ్‌‌కుమార్‌‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పక్షుల సంరక్షణ, వాల్టా చట్టం ప్రకారం ఈ ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు.