మొంథా తుఫాన్ తీరం దాటినా వాన గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ లో మున్నేరువాగు ఉగ్ర రూపం దాల్చింది. మహబూబాబాద్ ... గూడూరు జాతీయ ప్రధాన రహదారి పై వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. మహబూబాబాద్.. నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో మహబూబాబాద్ పోలీసులు ట్రాఫిక్ ను మళ్ళిస్తున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో వాగులు.. వంకలు పొంగుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెరిగిన మున్నేరు వాగు నీటిమట్టం పెరిగింది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వరద ప్రవాహం 19 అడుగులకు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలతో మున్నేరుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో పంట పొలాలు మునిగిపోయాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో అంతకంతకూ పెరుగుతున్న మున్నేరు వరద ప్రవాహం పెరుగుతుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. భారీవర్షాల దృష్ట్యా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలకు అత్యవసర సహాయం కొరకు కంట్రోల్ రూమ్,టోల్ ఫ్రీ నెంబర్లు 1800 425 3424, 9154225936, 1800 425 1115 ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యల కోసం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 ఏర్పాటు చేశారు.
లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఐఎండీ తెలిపింది. భారీ వర్షా రీత్యా భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
