‘దళిత బంధు’  పేరుతో  కేసీఆర్ మోసం చేస్తుండు: వివేక్ వెంకటస్వామి

‘దళిత బంధు’  పేరుతో  కేసీఆర్ మోసం చేస్తుండు: వివేక్ వెంకటస్వామి

నల్గొండ జిల్లా: సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని మునుగోడు బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ దళితులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కొత్త రాష్ట్రానికి దళితుడినే మొదటి సీఎంగా చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి  ఇవ్వకపోగా.. ఉన్న భూమిని ధరణి పేరుతో లాక్కున్నారని ఫైర్ అయ్యారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి ఉంటే పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి 15 వేలు, రైతు బంధు ద్వారా 30 వేల రూపాయలు వచ్చేవని చెప్పారు. ధరణిలో కబ్జాదార్ కాలమ్ తీసేసి దళితులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దళితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని, వాళ్లకు ఏ రకమైన ఆర్ధిక చేయూతనందించలేదని చెప్పారు. దళితులను మోసం చేయడానికి దళిత బంధు అంటూ డ్రామాలాడుతున్నారని కేసీఆర్ పై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

యాదాద్రి గుడి మలినమైందని కేటీఆర్ అహంకారంతో మాట్లాడిండు

బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ యాదగిరి గుట్టలో ప్రమాణం చేస్తే.. గుడి మలినమైందని కేటీఆర్ అహంకారంతో మాట్లాడారని వివేక్ మండిపడ్డారు. దళితులు, బీసీలంటే కేసీఆర్ కుటుంబానికి చులకన అని పేర్కొన్నారు. ఎవరైనా తమ తప్పు లేదని నిరూపించుకోవడానికి దేవునిపై ప్రమాణం చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని వివేక్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడానికే బండి సంజయ్ ప్రమాణం చేశారని గుర్తు చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించి కేసీఆర్, కేటీఆర్ లకు బుద్ధి చెప్పాలని వివేక్ పిలుపునిచ్చారు.