మోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల

మోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య మునుగోడు ఎన్నికలు : షర్మిల

మనుషులనే కాదు దేవుళ్ళను సైతం సీఎం కేసీఆర్ మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ధర్మపురిలో ప్రజాప్రస్థాన పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ షర్మిల...   ధర్మపురి క్షేత్రానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.100 కోట్లు ఏవి..? అని ప్రశ్నించారు. లక్ష్మీ నరసింహ స్వామి రిజర్వాయర్ కనిపించదేం... అని నిలదీశారు. మునుగోడు ఎన్నికలు మోసగాళ్ళకు,- మొనగాళ్లకు కాదు.. మోసగాళ్ళకు, మెగా మోసగాళ్ళకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. కేసీఅర్ మెగా మోసగాడన్న ఆమె... బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించాడని విమర్శించారు. కేసీఅర్ చెప్పిన ఒక్క పథకం కూడా అమలు కాలేదని చెప్పారు.

అంతా మోసమే...

డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర నుంచి ఉద్యోగాల వరకు అంతా మోసమేనని వైఎస్ షర్మిల తెలిపారు. ధర్మపురి నియోజకవర్గానికి SRSP కాలువల మరమత్తులు చేయించి వేల ఎకరాలకు వైఎస్ఆర్ సాగు నీరు అందించారని చెప్పారు. గోదావరి నదిపై చిన్న లిఫ్ట్ లు కట్టించారని, చిన్న గ్రామాలకు  తాగు, సాగునీరు అందించారన్నారు. ఇప్పుడు ఆ లిఫ్ట్ లు వరదలకు చెడిపోతే బాగు చేయించే దిక్కు లేదని ఆరోపించారు. ధర్మపురి నియోజకవర్గానికి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఒక తలమానికమని చెప్పారు. YSR హయాంలో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చేశారన్న ఆమె... దూప,దీప నైవేద్యం పథకాన్ని ఇదే ఆలయం నుంచి అమలు చేశారని తెలిపారు. టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ భవనం వైఎస్సార్ కట్టించిందేనని ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకున్నారు.

మనుషులనే కాదు.. దేవుళ్ళనూ మోసం చేసిండ్రు  

ఇందిమనుషులనే కాదు.. దేవుళ్ళను సైతం అబద్ధపు హామీలు చెప్పి మోసం చేశారరమ్మ కాలనీ కట్టించారని, ఈ ధర్మపురికి ప్రధాన రహదారులు నిర్మించారని వైఎస్ షర్మిల చెప్పారు.YSR ఇంత చేస్తే ఈ ధర్మపురికి కేసీఅర్ చేసింది శూన్యమన్నారు. కేసీఅర్ కి యాదాద్రి తప్ప మిగతా ఆలయాల అభివృద్ధి పట్టదని విమర్శించారు. మనుషులనే కాదు.. దేవుళ్ళను సైతం అబద్ధపు హామీలు చెప్పి మోసం చేశారన్న షర్మిల.. YSR ఇదే ధర్మపురికి 30 పడకల ఆసుపత్రి ఇస్తే..100 పడకల ఆసుపత్రి చేస్తామని మరిచారని ఆరోపించారు. రెవెన్యూ డివిజన్ చేస్తామని కేసీఅర్ మోసం చేశారని, చెక్ డ్యాంలు అని.. లక్ష్మీ నరసింహ స్వామి రిజర్వాయర్ అని మాయ మాటలు చెప్పారని విమర్శించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదన్నారు. రిజర్వాయర్ కట్టినట్లు హరీష్ రావు వచ్చి హడావిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఎకరాకైనా సాగునీరు ఇవ్వాలన్న చిత్త శుద్ది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ప్రాజెక్ట్ నూ మెగా కంపెనీకి కట్ట బెట్టిన మెగా మోసగాళ్లు మీరు..

ఇక స్థానిక ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. చావు తప్పి కన్ను లోట్టపోయినట్లు 440 ఓట్ల తో గెలిచి కులం కోటా కింద మంత్రి పదవి దక్కించుకున్నారని అన్నారు. మంత్రి నియోజకవర్గానికి కాదు..ఆయనకేనని సెటైరికల్ కామెంట్స్ చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రశ్నిస్తే జర్నలిస్ట్ ల పై కేసులు..సోషల్ మీడియాలో ఎవరైనా ఎదిరిస్తే పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రోళ్లవాగు ప్రాజెక్ట్  చెడిపోతే రూ.100 కోట్లు పెట్టి మరమత్తులు అని చెప్పి మోసం చేశారన్నారు. వరదల్లో పేదల ఇల్లు కొట్టుకు పోతే వారిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల కోసం..అధికారం అనుభవించడానికి మాత్రమే టీఆర్ఎస్ నేతలున్నారని విమర్శించారు. ' మునుగోడులో మోసగాళ్ళకు, మొనగాళ్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటున్నారు. అసలు ఎవరు మోసగాళ్లు, ఎవరు మొనగాళ్లు..?' అని ప్రశ్నించారు. బీజేపీ మోసగాళ్లు నిజమే..మీరు మెగా మోసగాళ్లు అని కీలక వ్యాఖ్యలు చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మోసం చేసిన మెగా మోస గాళ్ళు అని మండిపడ్డారు. మెగా మోసం చేసిన టీఆర్ఎస్ నేతలు 420 గాళ్లని, ఎంతో మందిని ముంచారని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్ట్ నూ మెగా కంపెనీకి కట్ట బెట్టిన మెగా మోసగాళ్లు అధికార పార్టీకి చెందిన నేతలే అని విమర్శించారు.

ఇది అప్పుల తెలంగాణ.. ఆత్మహత్యల తెలంగాణ

ఒట్లేస్తేనే అభివృద్ధి అని చెప్పిన మెగా మోసగాళ్లు కేసీఆర్, కేటీఆర్ అన్న షర్మిల...  తెలంగాణలో YSR తెచ్చిన ప్రతీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. "ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకం సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కులేదన్నారు. కేసీఅర్ పాలనలో బాగుపడ్డ వర్గం లేనే లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి అయ్యిందన్నారు. తెలంగాణ ఖజానాను మొత్తం కొల్లగొట్టారన్న ఆమె... రాష్ట్ర సంపదను మొత్తం దోచుకుతిన్నారని ఆరోపించారు.  కేసీఅర్ ఇంత అవినీతి చేస్తున్నా.. అడిగే వారే లేరన్నారు. తెలంగాణలో ప్రశ్నించే పార్టీ లేదన్న షర్మిల...-. మాట మీద నిలబడే న్యాయకత్వమే లేదన్నారు. అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలని, రైతును నెత్తిన పెట్టుకొనే ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు. మళ్ళీ పెన్షన్ లు ఇచ్చే ప్రభుత్వం రావాలన్న షర్మిల... ప్రజలు ఆశీర్వదిస్తే  వైఎస్సార్ సంక్షేమ పాలన తెస్తానని స్పష్టం చేశారు.