నాలుగు పార్టీలు మారిన నువ్వా నాకు చెప్పేది..?

నాలుగు పార్టీలు మారిన నువ్వా నాకు చెప్పేది..?
  • డబ్బు కోసమేనని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా
  • సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధి రేవంత్ 

హైదరాబాద్ :  నాలుగు పార్టీలు మారిన వ్యక్తా తన మీద విమర్శలు చేసేది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. మంగళవారం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోరు తెరిస్తే సోనియా తల్లి అని మాట్లాడుతున్న రేవంత్.. ఆనాడు సోనియాను బలిదేవత అని నిందించలేదా అని ప్రశ్నించారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తిట్టి.. ఇవాళ తాను సోనియాగాంధీని అవమానించారని అనడం సరికాదన్నారు. అక్రమంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ పార్టీని నాశనం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ లో ఓడిస్తే.. చావు తప్పి కళ్లు లొట్టలు పోయిన చందంగా మల్కాజిగిరిలో గెలిచారని, అలాంటి వ్యక్తి తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరునేదిలేదని హెచ్చరించారు. 

డబ్బు కోసమే పార్టీ మారుతున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా...

మంచి మిత్రుడని చెబుతూనే వ్యాపారాల కోసం అమ్ముడుపోయినట్లు రేవంత్ రెడ్డి తనను విమర్శిస్తున్నారని, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ తాను కాదా అని రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో త్యాగం చేశానని, టీఆర్ఎస్ ను అధికారం నుంచి దించడానికే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు కాంట్రాక్టులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి  ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు కోసమే తాను బీజేపీలోకి చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన..డబ్బు కోసమే బీజేపీకి వెళ్తున్నానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్ తన పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లడుతున్నారన్న ఆయన.. ఒక కులాన్ని పొగుడుతూ మిగతా కులాలను రేవంత్ కించపరిచారని ఆరోపించారు. 

కాంగ్రెస్  ని వాడుకుని ముఖ్యమంత్రి అవ్వాలని చూస్తున్నవ్...

తాను రేవంత్ కు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అసలు ఆయన ఎప్పుడూ తన ఇంటికి రాలేదని తెలిపారు. కాంగ్రెస్ తన గుత్తాధిపత్యం అయినట్లు రేవంత్ వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. తనను పండబెట్టి తొక్కుతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్న ఆయన.. మూడు ఫీట్లు ఉన్న రేవంతా తనను తొక్కేది అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రేవంత్ ఎక్కడికిపోయినా కాంగ్రెస్ కార్యకర్తలతో సీఎం సీఎం అంటూ సొంత డబ్బా కొట్టించుకుంటారని ఆరోపించారు. తమ బ్రాండ్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ కు లేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అలాంటి చిల్లర వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేస్తే మూడు వేల ఓట్లు కూడా సాధించలేకపోయారని విమర్శించారు. 

నీది కాంగ్రెస్ రక్తం కాదు..

తనది కాంగ్రెస్ రక్తం కాదని, అవకాశ రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి వెనుక ఉన్నది చంద్రబాబు, సీమాంధ్ర పెట్టుబడిదారులని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలగాణలో కాంగ్రెస్ పార్టీ అసలే గెలవదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఆత్మ గౌరవమున్న తనలాంటి నాయకులు పార్టీ నుంచి బయటికి పోతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తుల ఆధ్వర్యంలో పని చేసేది లేదని, అందుకే కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు... మోడీ, అమిత్ షా నాయకత్వంలో పని చేయనున్నట్లు స్పష్టం చేశారు.

మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు 

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో ఎవరూ సంతోషంగా లేరన్న ఆయన.. తన దిష్టి బొమ్మలు తగలబెట్టాలని చెప్పిన వాళ్లు ఎమ్మెల్యేగా గెలిచారా అని ప్రశ్నించారు. వచ్చే ఉప ఎన్నికలో మునుగోడు ప్రజలే రేవంత్  రెడ్డికి బుద్ది చెబుతారని చెప్పారు.