
- దంపతులపై దాడి చేసిన మందుబాబు
- భార్యను అడ్డుకోబోయిన భర్తను కత్తితో పొడిచి మర్డర్
- తుకారంగేట్ పీఎస్ పరిధిలో ఘటన
సికింద్రాబాద్ ,వెలుగు : మద్యం మత్తులో వండని (పచ్చి) చికెన్ తినొద్దన్నందుకు మహిళపై దాడి చేసి.. అడ్డొచ్చిన ఆమె భర్తను ఓ వ్యక్తి హత్య చేశాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ తుకారాంగేట్ గోల్ బాయి ప్రాంతానికి చెందిన ఓ రాజకీయ నేత ఇంట్లో ఆరు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అదే కాంప్లెక్స్‌లో అద్దెకు ఉండే శ్రీనివాసచారి(42) అద్దెలు వసూలు చేసి యజమానికి అందజేస్తుంటాడు. అజయ్(23), ప్రియాంక దంపతులు తమ కూతురు (8 నెలలు) అక్షతతో కలిసి అక్కడే ఉంటున్నారు.
అజయ్ బ్యాండ్‌మేళం గ్రూప్‌లో పని చేస్తున్నాడు. చాలాకాలంగా శ్రీనివాసచారి, అజయ్ స్నేహితులుగా ఉంటున్నారు. శ్రీనివాస చారి తాగుడుకు బానిసగా మారడంతో కుటుంబసభ్యులు అతడిని వదిలి దూరంగా వెళ్లి ఉంటున్నారు. దీంతో అతడు ఒక్కడే తన గదిలో ఉంటాడు. అతడు తరచూ తాగొస్తూ.. బస్తీలో ఉండే వారితో గొడవ పడుతుంటాడు. ఈనెల14న సంక్రాంతి పండుగ రోజున మందు తాగి.. షాపు నుంచి చికెన్ తెచ్చుకుని ఒక వైపు వండుతూనే మరో వైపు పచ్చి మాంసాన్ని తింటున్నాడు. ఇది చూసిన అజయ్భార్య ప్రియాంక పచ్చిమాంసం ఎందుకు తింటున్నావని ప్రశ్నించింది.
దీంతో కోపోద్రిక్తుడైన చారి పక్కనే ఉన్న కూరగాయల కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో చేతికి గాయాలు కాగా పెద్దగా కేకలు వేయడంతో.. అజయ్ వెళ్లి శ్రీనివాస్‌చారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో శ్రీనివాస్ చారి మరింత కోపంతో అజయ్‌పై కత్తితో కడుపులో పొడిచాడు. స్థానికులు శ్రీనివాసచారిని అడ్డుకుని అజయ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా..
అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధితురాలు ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంతకాలంగా శ్రీనివాసచారి సైకోలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. అందరితో గొడవకు దిగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు పేర్కొంటున్నారు.