దొంగను పట్టించిన ఆత్మ!

దొంగను పట్టించిన ఆత్మ!

ప్రపంచవ్యాప్తంగా రోజూ మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. అలాంటి కొన్ని కేసులను చంపిందెవరనేది తెలియకుండానే క్లోజ్​ చేస్తుంటారు. ఈ కేసు కూడా అలాంటిదే. సాక్ష్యాలు దొరక్క కేసు క్లోజ్​ చేసే టైంలో.. తన మర్డర్​ కేసు ఎటూ తేలడం లేదనుకుందో ఏమో చివరికి ఆత్మే పోలీసులకు హెల్ప్ చేసింది. అంతేకాదు... తనను చంపిన వ్యక్తిని భయపెట్టి మరీ నేరం ఒప్పుకునేలా చేసింది. ఆత్మ సాక్ష్యం చెప్పడమనేది వింతగా అనిపించినా.. ఈ విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. 1977లో అమెరికాలో తెరెసిటా హత్య కేసులో ఆత్మే క్లూస్​ ఇచ్చిందని చెప్తుంటారు. ఈ కేసులో చట్టంలో లేని కొన్ని విషయాలను పోలీసులు నమ్మాల్సి వచ్చింది. అందుకే అమెరికా పోలీసు చరిత్రలో తెరెసిటా బసా కేసు చాలా ప్రత్యేకమైంది.  తెరెసిటా బాసా ఫిలిప్పీన్స్‌‌లో పుట్టి, పెరిగింది. ఉన్నత చదువులు చదివింది. తర్వాత సంగీతం నేర్చుకోవడానికి అమెరికా వెళ్లి, షికాగోలోని ఓ కాలేజీలో చేరింది. అక్కడే ఉంటూ మ్యూజిక్​లో ఎంఏ చేసింది. తెరెసిటాకు పియానో ​​వాయించడం చాలా ఇష్టం. ఆమెకు మ్యూజిక్​ నేర్చుకుంటున్నప్పుడే డాక్టర్​ అవ్వాలి అనిపించింది. దాంతో మెడికల్​ కాలేజీలో చేరి, చదువు పూర్తి చేసి ఓ హాస్పిటల్​లో డాక్టర్​గా చేరింది. ఆమెకు  అప్పటికే 47 ఏండ్లు. అది 1977,  ఫిబ్రవరి 21 సాయంత్రం. తన ఫ్రెండ్​తో ఫోన్‌‌లో మాట్లాడుతోంది. సడెన్​గా మరో ఫ్రెండ్ ఒకరు వస్తారని చెప్పి కాల్ డిస్‌‌కనెక్ట్ చేసింది. తెరెసాతో అతను మాట్లాడింది అదే చివరిసారి. ఆ కాల్ డిస్‌‌కనెక్ట్ చేసిన గంట తర్వాత తెరెసిటా ఉంటున్న అపార్ట్‌‌మెంట్ నుండి అకస్మాత్తుగా పొగ రావడం మొదలైంది. చుట్టుపక్కల వాళ్లు ఫైర్​ స్టేషన్​కు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు. వెంటనే ఫైర్​ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం మొదలుపెట్టారు. గమనిస్తే.. తెరెసిటా ఉంటున్న ఫ్లాట్‌‌ నుంచే మంటలు చెలరేగాయి. దాంతో మంటలు ఆర్పిన తర్వాత ఫైర్​ సిబ్బంది ఆమె ఫ్లాట్​కు వెళ్లి చూశారు. అక్కడ కార్పెట్‌‌ నుంచి పొగలు రావడం గమనించారు. సిబ్బందిలో ఒకతను కార్పెట్ తెరిచి చూశాడు. అందులో అప్పటికే సగం కాలిపోయిన తెరెసిటా శవం కనిపించింది. శరీరంపై ఒక్క గుడ్డ ముక్క కూడా లేదు. ఛాతి భాగంలో చాకు గుచ్చి ఉంది. ఇది చూసిన ఫైర్​ సిబ్బంది వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు ముందు అది హత్యగా నిర్దారించుకున్నారు. ఆమెకు బట్టలు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్లు అంచనా వేశారు. క్లూస్​ లేకుండా చేయడానికే శవానికి నిప్పంటించారేమో అనుకున్నారు. 

ఇంట్లో లెటర్ 

పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి పంపించారు. రిపోర్టులు వచ్చాక పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి. అందులో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. అసలు ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి పోలీసులు ఆమె ఇంట్లో అణువణువు గాలించారు. వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడి ఉన్నాయి. అదంతా చూసిన తర్వాత ఇంటిని దోపిడీ చేయాలనే ఉద్దేశంతోనే  హత్య చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. తర్వాత తెరెసిటా తల్లిదండ్రులను, ఆమె ఫ్రెండ్స్​ని విచారించారు. కానీ ఎటువంటి క్లూ దొరకలేదు. దాంతో ఏదైనా క్లూ దొరకొచ్చనే ఉద్దేశంతో రెండోసారి తెరెసిటా ఫ్లాట్‌‌లో వెతికారు. అప్పుడు పోలీసులకు ఒక లెటర్​ దొరికింది. అందులో ‘గెట్​ థియేటర్ టిక్కెట్ ఫర్​ ఏఎస్​’ అని రాసి ఉంది. కానీ.. అందులో ఉన్న ఏఎస్​ అనే అక్షరాలకు అర్థం ఏమిటో తెలుసుకోలేకపోయారు. దాని మీద చాలా రోజులు ఎంక్వయిరీ చేసినా కనిపెట్టలేకపోయారు. విచారణ కొన్ని నెలల తరబడి జరిగినా నేరస్తుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు.

డిటెక్టివ్‌‌కి.. 

ఈ కేసు సాల్వ్​ చేయడం పోలీసుల వల్ల కావడం లేదని డిటెక్టివ్ జోసెఫ్ ఈ కేసును టేకప్​ చేశాడు. కొన్నాళ్లకు అతనికి పోలీసుల నుంచి ఒక లెటర్​ వచ్చింది. అందులో ‘తెరెసిటా కేసులో సాక్షి దొరికింది. మీరు వెంటనే మమ్మల్ని కలవండి’ అని ఉంది. డిటెక్టివ్‌‌ వెంటనే పోలీస్ స్టేషన్‌‌కి చేరుకుని ఇన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా సాక్షి దొరకడమేంటని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు వాళ్లు.. ఒక డాక్టర్ తమ దగ్గరికి వచ్చి తెరెసిటా హత్య గురించి చెప్పాడన్నారు. దాంతో డిటెక్టివ్‌‌ ఆ డాక్టర్‌‌ని కలిసినప్పుడు అతను కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్పాడు. ఆ డాక్టర్​ ఒక హాస్పిటల్​లో పనిచేస్తున్నాడు. అతని భార్య కొన్ని రోజులుగా వింతగా ప్రవర్తిస్తోంది. నిద్రలో కబుర్లు చెప్తోంది. కొన్నిసార్లు రాత్రి టైంలో ఆమె గొంతు మారిపోతుంది. ఒకరోజు ఆమె నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా మాట్లాడటం మొదలుపెట్టింది. దాంతో డాక్టర్​ భయపడ్డాడు. ఆమె ‘నన్ను అలన్ షవరీ అనే వ్యక్తి హత్య చేశాడు. అతను టీవీ రిపేర్​ చేయడానికి నా ఇంటికి వచ్చాడు.  తర్వాత నన్ను కొట్టి చంపి దోపిడీ చేశాడు’ అని చెప్పింది. కానీ.. ఆ డాక్టర్​ ఆమె మాటలు సీరియస్​గా తీసుకోలేదు. 

అందుకే ముందుకొచ్చాడు

భార్య చెప్పిన విషయాన్ని పట్టించుకోకపోవడంతో మరుసటి రోజు మరింత కఠినంగా చెప్పింది.  కోపంగా పెద్దగా మాట్లాడుతూ.. ‘నేను మిమ్మల్ని సాయం అడిగాను. కానీ.. మీరు చేయడంలేదు.   నాకు సాయం చేయకపోతే ఆ ఎఫెక్ట్​ మీ భార్య మీద పడుతుంది” అని చెప్పింది. దాంతో డాక్టర్  ఆమెతో మాట్లాడాడు. అప్పుడామె తన పేరు తెరెసిటా అని చెప్పింది. ఆమె ఎలా హత్యకు గురైందో వివరించింది. అలన్​ షవరీ అనే టీవీ మెకానిక్‌‌ తనను చంపి నగలను దొంగిలించాడని చెప్పింది. ఆ నగలను తన గర్ల్​ ఫ్రెండ్స్​కి ఇచ్చాడని కూడా చెప్పింది. షవరీతోపాటు అతని ఫ్రెండ్స్ ఫోన్​ నెంబర్లు కూడా డాక్టర్​కి చెప్పింది. అందుకే ఆ డాక్టర్​ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ముందుకొచ్చాడు. 

ఇన్వెస్టిగేషన్​ 

తెరెసిటా ఇంట్లో దొరికిన లెటర్​లో ఉన్న ఏఎస్​ అనే అక్షరాల అర్థం అలన్​ షవరీ అని డిటెక్టివ్ జోసెఫ్​కు అర్థమైంది. అయితే.. ఇందులో నిజమెంతో తెలుసుకోవడానికి ముందుగా తెరాసిటా టీవీని పరీక్షించారు. అది నిజంగానే పాడైందని తెలిసింది. దాంతో డిటెక్టివ్​, పోలీసులకు డాక్టర్​ చెప్పిన స్టోరీ నిజమని నమ్మకం కలిగింది. ఇన్వెస్టిగేట్​ చేస్తే తెరెసిటా పనిచేసిన హాస్పిటల్​లోనే అలన్ షవరీ పని చేసినట్లు పోలీసులకు తెలిసింది. అతన్ని కలిసి ‘నీకు గర్ల్‌‌ఫ్రెండ్ ఉందా?’ అని పోలీసులు అడిగారు. దానికి ‘ఉంది’ అని సమాధానం ఇచ్చాడు. వాళ్లు అతని లవర్ ఇంటికి వెళ్లి, ఆమెను విచారించారు. షవరీ నిజంగానే ఆమెకు నగలు గిఫ్ట్​గా ఇచ్చాడని తేలింది. అంతేకాదు.. ఆ నగలు తెరెసిటావే. దాంతో వెంటనే అలన్​ని అరెస్ట్​ చేశారు. కానీ.. అతనే హత్య చేశాడని కోర్టులో రుజువు చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆత్మ సాక్ష్యాన్ని కోర్టు ఎలా అంగీకరిస్తుంది? 

అలెన్​ని ఒప్పించిందా? 

అలెన్​ కేవలం దొంగతనం మాత్రమే చేశాడని, హత్య చేయలేదని అతని లాయర్​ వాదించాడు. అతను దొంగతనం చేసినప్పుడు తెరెసిటా బతికే ఉందని కోర్టుని నమ్మించారు. పోలీసులు కూడా అతనే చంపాడు అని నిరూపించడానికి సాక్ష్యాలు చూపించలేకపోయారు. దాంతో పోలీసులు అలెన్​ను కస్టడీలో ఉంచుకోవడం కుదర్లేదు. బలవంతంగా విడుదల చేయాల్సి వచ్చింది. కానీ.. కొన్ని రోజుల తరువాత తెరెసిటా ఆత్మ మళ్లీ డాక్టర్ భార్యలోకి వచ్చింది. కోపంగా ఆమె హత్య గురించి మళ్లీ చెప్పింది. దాంతో డాక్టర్ కోపంగా ‘‘నన్నేం చేయమంటావ్​. జరిగిందంతా పోలీసులకు చెప్పినా అతను విడుదలయ్యాడు’ అన్నాడు. దాంతో ఆమె ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్లందరినీ వేధించడం మొదలుపెట్టింది. 

రెండోసారి కూడా.. 

పోలీసులకు ఏం చేయాలో తెలియలేదు. ఆత్మ చెప్పినవన్నీ నిజాలే అయ్యాయి. హత్య కూడా నిజమే అని నమ్మారు. దాంతో మళ్లీ అలన్​పై హత్య కేసు నమోదు చేశారు. మళ్లీ విచారణ మొదలైంది. కానీ.. అలన్ హత్య చేసినట్లు రుజువు కాలేదు. దాంతో రెండోసారి కూడా అతన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ.. తెల్లారితే అలెన్​ని విడుదల చేస్తారు అన్నప్పుడు ఒక వింత జరిగింది. అదేంటంటే.. అలెన్ అకస్మాత్తుగా మారిపోయాడు. డిటెక్టివ్, అతని లాయర్లు, పోలీసుల ముందు అతనే తెరెసిటాను చంపినట్లు ఒప్పుకున్నాడు. అప్పటికే టీవీ చాలాసార్లు చెడిపోయింది. ప్రతిసారీ తెరెసిటా అతనికి ఫోన్ చేసేది. అతను టీవీ బాగుచేసి, కాఫీ తాగి వెళ్లిపోయేవాడు. కానీ.. ఈసారి టీవీ బాగుచేయడానికి వెళ్లినప్పుడు తెరెసిటా ఇంట్లో నగలు ఉన్నాయని తెలిసింది. వాటిని దొంగిలిస్తుండగా తెరెసిటా చూసింది. అందుకే ఆమె గొంతు కోసి, ఆపై ఛాతీలో కత్తితో పొడిచాడు. పోలీసులకు అత్యాచారంగా అనిపించాలని బట్టలన్నీ తీసి, ఆమె బాడీని కార్పెట్‌‌లో చుట్టి నిప్పంటించాడు. ఈ విషయాన్ని అలన్ ఒప్పుకోవడంతో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 

అలన్​ ఎందుకు మారిపోయాడు?

అలన్ షవరీ హత్య చేసినప్పుడు ఒప్పుకోవడం వెనుక ఓ పెద్ద కథే ఉంది. అతను అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అలన్‌‌ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన కొద్దిసేపటికే తెరెసిటా ఆత్మ జైలులో ఉన్న అతని దగ్గరకు వెళ్లి, నేరాన్ని అంగీకరించమని బలవంతం చేసింది. లేకపోతే తనను చంపేస్తానని బెదిరించింది. అందుకే అలన్​ ఒప్పుకున్నాడు. 

సినిమా కూడా తీశారు

వాస్తవానికి ఇదంతా ఎలా జరిగింది? ఆత్మలు నిజంగానే ఉన్నాయా? అసలు ఎవరికీ తెలియని విషయాలను డాక్టర్​ భార్య ఎలా చెప్పింది? అనేది పక్కన పెడితే.. ఈ కేసు చాలామందిని ఎట్రాక్ట్​ చేసింది. దీనిపై పోలీసు అధికారులను ఎంతోమంది ఇంటర్వ్యూ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి కేసు మొదటిదని, దీనిని దెయ్యం పరిష్కరించిందని చాలామంది నమ్మారు. చికాగో పోలీసులు ఈ కేసుకు ‘వాయిస్ ఫ్రమ్ ది గ్రేవ్’ అని పేరు పెట్టారు. ఈ మిస్టరీని ఆధారంగా చేసుకుని 1996లో ఇదే పేరుతో సినిమా కూడా తీశారు.