అమ్మాయిని వేధించిన మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్

అమ్మాయిని వేధించిన మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్

రంగుల ప్రపంచం ఆశ చూపి.. ఆడవాళ్లను లోబర్చుకునే అవకాశవాదులు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉంటారు. ఆ లిస్ట్ లోకే ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేరాడు. శృతి తప్పడంతో.. జైలుపాలయ్యాడు.

మురళీధర్ రావు అలియాస్ మురళి.. సంగీత దర్శకుడిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. బెంగళూరులోని కేఎస్ లేఔట్ లో ఉంటున్నాడు. ఫేస్ బుక్ లో ప్రముఖ హీరోలు, టెక్నీషియన్లు, డైరెక్టర్లతో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తుండేవాడు. అలా పరిచయమైన అమ్మాయిలకు.. టాలెంట్ ను బట్టి.. నటిగా లేదా… సింగర్ గా చాన్స్ ఇస్తానని అవకాశాలిస్తానంటూ పరిచయం పెంచుకునేవాడు. ఐతే తనను వేధించడమే కాకుండా… న్యూడ్ ఫొటోలు పంపి.. హింసిస్తున్నాడంటూ ఓ అమ్మాయి బెంగళూరు పోలీసులకు కంప్లయింట్ చేయడంతో.. మ్యూజిక్ డైరెక్టర్ మురళిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. లైంగిక వేధింపుల చట్టంలోని 354ఏ సెక్షన్ ప్రకారం కేసు పెట్టారు.

అడ్వర్టైజ్ మెంట్లు, సీరియల్స్ లో అవకాశాలిప్పిస్తానని..  లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకోవచ్చని నమ్మించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.  ఫొటోషూట్ కోసం తన ఇంటికి రమ్మన్నాడని చెప్పింది. ఐతే.. తాను వెళ్లడానికి ముందే… ఫోన్లు, చాటింగ్ లో లైంగికంగా వేధింపులు మొదలుపెట్టాడని చెప్పింది. బ్రేక్ కావాలంటే లైఫ్ లో కాంప్రమైజ్ కావాలని చెప్పాడని తెలిపింది.

బాధితురాలి ఫిర్యాదుతో మురళిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత బెయిల్ పై మురళి విడుదలయ్యాడు. గతంలోనూ మురళిపై మరో మహిళ ఇలాంటి ఆరోపణలే చేసిన విషయాన్ని పోలీసులు గుర్తుచేశారు.