అయోధ్యలో..అందరి రాముడు

అయోధ్యలో..అందరి రాముడు

‘ఓమ్’ అన్నమాటలో ఏ వ్యాకరణం ఉందో ‘రామ్’ అన్నమాటలో అదే నాదం ఉందని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ‘రామ’శబ్దం అంతకుముందే మన సంప్రదాయంలో ఉంది. కాబట్టే దశరథుడి కుమారుడికి ఆ పేరు పెట్టారు. శ్రీరాముడిగా చెప్పే రామాయణ నాయకుడు ఈ దేశ ప్రజలనే కాదు విదేశాలను కూడా ప్రభావితం చేసినట్లు అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అతిపెద్ద ముస్లిం జనాభాగల ఇండోనేసియాలో ‘రామలీల’ ప్రదర్శన మనదేశం కన్నా ఎక్కువగా జరుగుతోంది. అందులో అందరూ ముస్లింలే పాత్రలు వేస్తారు. అలాగే ఇండోనేసియా జాతీయ బ్రాడ్​కాస్టింగ్​ నెట్ వర్క్​ సంవత్సరం అంతా రామాయణం ప్రసారం చేస్తోంది. థాయ్​లాండ్, కొరియా దేశాల్లో ఈరోజుకూ రామాయణం ప్రభావం ఉంది

 కింగ్ టైటిల్ ‘రామ్’ పేరుతో ఉండడం విశేషం. అలాగే జోర్డాన్​ పక్కనే ఓ నగరం పేరు రామల్లా.  ఇరాక్–టర్కీ సరిహద్దులోని గుహల్లో ‘కిరీటధారి’గా  రామచిత్రం దొరికింది. లాటిన్​ అమెరికా (హోండురాస్​)లో ‘మంకీగాడ్’ అని హనుమను పిలుస్తారు. ఇలా అయోధ్య నుంచి హోండురాస్​వరకు రాముడు వెళ్లినమాట వాస్తవం. భారత్​లోనైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో రామునితో కలిసే పేర్లు ఉంటాయి. గ్రామాలకు, సరస్సులకు, వీధులకు, రోడ్లకు, క్షేత్రాలకు పేర్లుంటాయి. 

ఉత్తర–దక్షిణ భారతాన్ని కలిపిందే శ్రీరాముడు. నిజానికి రావణుడిది దక్షిణ దేశం అని చాలామంది అపోహ పడుతుంటారు. పరిశోధకుల ప్రకారం రావణుడు ఢిల్లీ దగ్గరున్న నొయిడాలో జన్మించి మీరట్​ రాజపుత్రిక మండోదరిని వివాహం ఆడాడు. అలాగే అయోధ్య చక్రవర్తి కుమారుడైన శ్రీరాముడు మూడు మహా సముద్రాల సంగమ స్థానంలో రామేశ్వరలింగాన్ని స్థాపించాడు. ఇక రామసేతువు విషయంలో ‘నాసా’ పరిశోధనలు రాముడి అస్తిత్వాన్ని నిరూపించాయి. మొత్తానికి వాల్మీకి విరచితమైన రామాయణం ఈ దేశంలోని ప్రతి మారుమూలకూ వెళ్లింది.

 ఆఖరుకు బౌద్ధంలో కూడా రాముడు ఉన్నాడు. అలాగే ప్రసిద్ధ జైన గురువు రాముడిని జైనులు తీర్థంకరులతో సమానంగా చూస్తారని తెలిపారు. హేమచంద్రుడి త్రిశష్టిశలాక పురుష వృత్తాంతం ‘జైన రామాయణం’గా ప్రసిద్ధి చెందింది. రాముడు గ్రీకులను కూడా ప్రభావితం చేశాడు. కాబట్టే వాళ్లు రామాయణం వంటి కథ సృష్టించుకున్నారు. చ్యవన రామాయణం వాల్మీకి కన్న ముందుందని వాదించిన నందార్గికర్​ (1897) వంటివారు ఉన్నారు. వాల్మీకి రామాయణం ఆధారంగా సంస్కృతం దేశిభాషల్లో  కలిపి సుమారు 300 రామాయణాలు వచ్చాయి. ఇందులో చాలామటుకు అవాల్మీక అంశాలను చెప్పాయి.

‘ఉడతాభక్తి’ అనేది అవాల్మీకం. దానిని మన తెలంగాణకు చెందిన గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’లో కల్పించాడు. రాముడిని ద్వేషిస్తామని చెప్పే ద్రవిడ పార్టీలు పుట్టకముందే అక్కడ పుట్టిన కంబన్​ రామాయణం వెలుగులోకి వచ్చింది. అలాగే మలయాళం నుంచి ‘ఎజుతచ్చన్​ రామాయణం’ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక తెలుగులో రాముడిని స్తుతించని తెలుగు కవి  లేడు. రంగనాథ, మొల్ల, భాస్కర, కల్పవృక్షం వంటివి తెలుగు ప్రాంతాల్లో మనకు తెలిసినవే. రాముడి ఆధారంగానే ఎన్నో కీర్తనలు భద్రాచల రామదాసు రచించాడు. ఉత్తర భారతాన్ని రామభక్తితో పరవశింపజేసిన గోస్వామి తులసీదాస్​ రామచరిత మానస్​ ప్రపంచంలో ఎక్కువ పఠనీయ గ్రంథాలలో చేరింది. 

రాముడికి ఎందుకింత కీర్తి

సుగ్రీవుడి భార్యను, రాజ్యాన్ని కబళించిన వాలిని అయోధ్య నుంచి కిష్కింధకు వచ్చిన రాముడు సంహరించాడు. రాజ్యాన్ని సుగ్రీవుడికి, అంగదుడికి సమర్పించాడు. అలాగే రావణ సంహారం చేసి లంకను విభీషణుడికిచ్చి పట్టాభిషేకం చేశాడు. ఆ సంప్రదాయమే శ్రీకృష్ణుడు అనుసరించి కురుక్షేత్రం తర్వాత హస్తినాపురాన్ని ధర్మరాజుకు అందజేసి పట్టాభిషేకం చేశాడు. 

అలాంటి రామరాజ్య భావనను అనుసరించే గాంధీజీ సుదీర్ఘ పోరాటం తర్వాత స్వాతంత్ర్యాన్ని జవహర్​లాల్​ నెహ్రూకు సమర్పించాడు. ఈ సమర్పణ, త్యాగభావం రాముడి నుంచే ఈ జాతి నేర్చుకున్నది. అందుకే రాజ్యాంగ రచన తర్వాత ప్రముఖ చిత్రకారుడు నందలాల్​ బోస్తో ‘రామచిత్రం’ గీయించి అందులో పొందుపరిచారు. కుటుంబ వ్యవస్థ, ధర్మం, త్యాగం, ప్రేమ, స్నేహం, సత్యం, ఏకపత్నీవ్రతం రాముడు ఈ జాతికిచ్చిన మౌలిక సూత్రాలు. ఇదే భారతీయ జీవనంగా ‘రామరాజ్యం’గా చెబుతారు. వాల్మీకి అయోధ్యకాండలో వర్ణించిన ‘అయోధ్య ప్రజల జీవితం’ రామరాజ్య భావనలో ప్రధాన భాగం. అది కావాలని ఈ దేశం కోరుకుంది. 

రామమందిరం ఆత్మగౌరవ పోరాటం

 క్రీ.శ 1526లో ఆఫ్గాన్​కు చెందిన బాబర్​ భారత్​పై దురాక్రమణకు వచ్చాడు. అతడి సేనాని మీర్​బాకీ 1528లో అయోధ్యపై దాడిచేసి రామజన్మ ప్రాంతాన్ని కూల్చి వేశాడనేది చరిత్ర. ఈ క్రమంలో దాడిని అడ్డుకునేందుకు అనేక యుద్ధాలు జరిగాయి. అసంఖ్యాక ప్రాణాలు పోయాయని చరిత్రకారులు చెప్పారు.  మొత్తానికి 1885లో ఫైజాబాద్​లో కోర్టు పంచాయితీ మొదలైంది. 1976–77, 2003లో తవ్వకాలు జరిగాయి. 2003 మార్చి 12 నుంచి ఆగస్టు వరకు లక్నో హైకోర్టు బెంచ్​ ఆదేశాలతో బీఆర్​మణి ఆధ్వర్యంలో జీపీఆర్​ సిస్టమ్​తో తవ్వకాలు జరిపిన అనంతరం 574పేజీల నివేదిక సిద్ధమైంది. తర్వాత కాలంలో రాజీవ్​గాంధీ, షహబానో కేసులో అవలంబించిన సంతుష్టీకరణ భారతీయ జనతాపార్టీకి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది.

 1990లో బీజేపీ అగ్రనేత లాల్​కృష్ణ అద్వానీ చేసిన ‘సోమనాథ్​ నుంచి అయోధ్య’ వరకు రథయాత్ర ఈ ఉద్యమాన్ని మరో మలుపు తిప్పింది. చివరకు 2019 నవంబర్​ 9న రామమందిర నిర్మాణంపై ఐదుగురు జడ్జీల తీర్పు ఇప్పుడు అయోధ్యలో మందిర నిర్మాణానికి బాటలు వేసింది. నాగరశైలిలో 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 392  స్తంభాలు, 44 ద్వారాలతో, 5 మండపాలతో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. భారతదేశంలో హిందువులను కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకూ ఏకం చేసిన మహోద్యమ రామమందిరం ఉద్యమం. 

వైరుధ్యాలొద్దు

కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి ‘రామమందిరం ప్రారంభం’ బీజేపీ, ఆర్ఎస్ఎస్​ మతోన్మాదం అన్నట్లు యథాలాపంగా వ్యాఖ్యానించారు. మరో కమ్యూనిస్టు నేత కె నారాయణ నోరుపారేసుకున్నాడు. శశిథరూర్​ న్యూట్రల్​గా మాట్లాడారు.  మరోవైపు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మందిర నిర్మాణం అంశం ప్రజల్లోకి నిశ్శబ్దంగా తీసుకువెళుతున్నది. అయోధ్య రైల్వేస్టేషన్, ఎయిర్​పోర్టు ప్రారంభంలో అంతకుముందు బీజేపీ సమావేశాల్లోగానీ మోదీ తాను రామభక్తుడిని అని చెప్పేశాడు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు ప్రతి ఇంట్లో 5 జ్యోతులు వెలిగించాలని మోదీ పిలుపునిచ్చాడు. 

రామభక్తి–రాజకీయం

ఇప్పటికీ గతంలో రామశిల ఉద్యమంలా ‘అక్షతలు’ ప్రతి ఇంటికి చేరుతున్నాయి. ఇందులో రామభక్తి–రాజకీయం రెండూ ఉన్నాయి. సెక్యులర్​ పార్టీలు కక్కలేక మింగలేక మోదీని విమర్శిస్తున్నాయి. కొందరు మేధావులు మోదీ రాజ్యం ‘రామరాజ్యం’ కాదని ఇక్కడ నిర్బంధం ఉందనీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రాముడిని మోదీ దృక్కోణంలో చూసేకన్నా ‘మర్యాద పురుషోత్తముడి’ దృక్కోణంలో చూసి భక్తి ప్రకటిస్తే ఉత్తమం. నిజానికి మోదీ ఉండడం వల్లనే ఇప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం అవుతున్నది అన్న విషయం దేశ ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు.  నిజమైన ‘సెక్యులరిజం’ శ్రీరాముడి ధర్మంలో ఉంది. ధర్మం అంటే అంగీకారం, సమానత్వం, సమర్పణ, త్యాగం.  శ్రీరాముడిలో ఈ గుణాలు కాకుండా రాజకీయం వెతికితే ఫలితం శూన్యం. 

- డా.పి. భాస్కర యోగి,సోషల్​ ఎనలిస్ట్​