వినాయక చవితి...వెల్లివిరిసిన మతసామరస్యం

వినాయక చవితి...వెల్లివిరిసిన మతసామరస్యం

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ముంబయిలోని లాల్ బాగ్చా రాజా పండాల్ కు భారీగా తరలివస్తున్న భక్తులు గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గణపయ్య దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. హిందూ - ముస్లింలు లంబోదరునికి పూజలు నిర్వహిస్తున్నారు. ముస్లిం పోలీసు అధికారి వినాయకుడి విగ్రహానికి పూజలు చేశారు. ధార్వాడ్ జిల్లా హుబ్బళ్లి పట్టణంలో గణేష్ వేడుకల్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ జాకీర్ భాషా  స్వయంగా గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకొచ్చారు. అనంతరం హారతిచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

కర్నాటకలోని మాండ్యలో గణేష్ చతుర్థి వేడుకలను ముస్లిం, హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. బీడీ కాలనీలోని గణేషుడిని పూజించేందుకు ఇరువర్గాల వారు తరలివచ్చారు. హుబ్బళ్లి ఈద్గా మైదానంలో జరిగిన వేడుకల్లో శ్రీరామ్ సేన అధినేత ప్రమాద్ ముతాలిక్, ఆయన మద్దతు దారుల చేతుల్లో సావర్కర్, బాలా గంగాధర్ తిలక్ ల ఫొటోలున్నాయి. హుబ్బల్లిలో ఈద్గా మైదాన్ లో గణేష్ చతుర్థి వేడుకలకు అక్కడి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈద్గా మైదానంలో గణేశుని వేడుకల కోసం నగర మున్సిపల్ కమిషన్ అనుమతించారు. కానీ దీనికి వ్యతిరేకంగా అంజుమన్ ఏ ఇస్లాం సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని.. అంజుమన్ ఏ ఇస్లాం సంవత్సరానికి ఒక్క రూపాయి రుసుముతో 999 ఏళ్లకు లీజుకు తీసుకుందని అన్నారు. వేడుకల్లో ఎలాంటి వివాదాస్పద పోస్టర్లు వాడకూడదని ఆంక్షలు విధించింది.