
ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో కొంతమంది మహిళలు ఆందోళనకు దిగారు. మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత తెలంగాణ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అయితే.. కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. 2017 టీఆర్‌టీలో ఉర్దూ మీడియం పోస్టులకు మెరిట్ ప్రకారం నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అక్కడి నుంచి బయటకు పంపించారు.
పవర్ ఐలాండ్గా హైదరాబాద్
హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్ నగరాల్లో కరెంట్ పోయినా..హైదరాబాద్లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్‌లో అనుసంధానం అయిందన్నారు. హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచమే అబ్బుర పడే విధంగా హైదరాబాద్ను డెవలప్ చేస్తామని చెప్పారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులు హైదరాబాద్కు వచ్చాయని వెల్లడించారు. అన్ని మతాలు, కులాలు, జాతులను అక్కున చేర్చుకున్న హైదరాబాద్..విశ్వనగరంగా మారుతుందని చెప్పారు. ఇక్కడ సమశీతల వాతావరణం ఉండటం వలన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరంలో నివసించేందుకు ఇష్టపడతారని చెప్పారు.