థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి

థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలి

అమరావతి: కరోనా థర్డ్ వేవ్‌ ప్రబలకముందే ఎదుర్కొనేందుకు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను  ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ తాను ముందే చెప్పినట్లు కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రస్తావిస్తూ.. ఏ మాత్రం నిర్లక్ష్యానికి అవకాశం లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరడు వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని..  వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యే వరకు అన్ని స్థాయిల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
ప్రజల్లో సెకండ్ డోస్ వ్యాక్సిన్‌ తొందరగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రైతులకు సంబంధించిన వ్యవసాయ, సంబంధిత కార్యక్రమాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ఖరీఫ్ సీజన్ లో  94.84 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. తగినంత వర్షాలు లేక ఇప్పటి వరకు  4.98 లక్షల ఎకరాల్లో మాత్రమే  పంటలు వేశారని.. మిగిలిన రైతులంతా పంటలు వేసుకునేలా చూడాలని సీఎం జగన్ సూచించారు.