
హైదరాబాద్ సిటీ, వెలుగు: డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని మేయర్ క్యాంప్ ఆఫీసు వద్ద జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం, హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
డెంగ్యూ ముప్పు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇంటి వద్ద నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి, వాటిని తొలగించాలని ప్రజలకు సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ప్రతి ఇంటికి డెంగ్యూ నివారణ స్టికర్లు అంటించి, ప్రజల్లో చైతన్యం నింపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.