హరీశ్ రావును కలిసినం.. టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తం

హరీశ్ రావును కలిసినం.. టికెట్ ఎవరికిచ్చినా గెలిపిస్తం
  •     హరిత ప్లాజాకు వెళ్లిన జనగామ లీడర్లు
  •     టికెట్​ ఎవరికిచ్చినా   గెలిపిస్తామని ప్రకటన

జనగామ, వెలుగు : ‘ప్రగతి భవన్​నుంచి ఫోన్​ వచ్చింది. మండలానికి ఇద్దరు ముఖ్య లీడర్లకు సీఎం కేసీఆర్​ అపాయింట్​మెంట్​ ఇచ్చినట్లు చెప్పిన్రు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత హుటాహుటిన వెళ్లినం. అర్జంట్‌‌ పని ఉండి కేసీఆర్​ కలువలేదు. మంత్రి హరీశ్​ రావు మాట్లాడిండు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలె అన్నడు’  అని హైదరాబాద్​ హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్లు చెప్పారు. మూడు రోజుల కింద జనగామ  బీఆర్ఎస్​ టికెట్​ పంచాయితీకి హైదరాబాద్​ హరిత ప్లాజా వేదికైన విషయం తెలిసిందే. దీంతో హరిత ప్లాజాకు వెళ్లిన లీడర్లపై ముత్తిరెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో భగ్గుమంటున్న నేపథ్యంలో వారు ఓపెన్​ అవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను ఎవరూ శంకించవద్దని అంటూనే ప్రగతి భవన్​ కేంద్రంగా అభ్యర్థిత్వం మార్పు అంశంపై పావులు కదులుతున్నట్లు చెప్పేశారు. ఎవరికి పార్టీ టికెట్​ ఇచ్చినా గెలిపించుకుంటామని అంటున్నారు. 

సఖ్యత లేమితో లొల్లి..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మంత్రి హరీశ్​ రావుకు మధ్య సఖ్యత లేదనేది ఓపెన్​ సీక్రెట్.​ పైకి ఇద్దరు కలిసి ఉన్నట్లు కనిపించినా లోలోపల అభిప్రాయ భేదాలు బయటపడిన సందర్భాలున్నాయి. పైగా జనగామ నియోజకవర్గంలో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు, దూళ్మిట్ట మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో సదరు మండలాల్లో మంత్రి హరీశ్​ వర్గం, ముత్తిరెడ్డి వర్గాలుగా బీఆర్​ఎస్​ లీడర్లు విడిపోయారు. ఇద్దరు లీడర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నిర్ణయాలే ఫైనల్​ అని సీఎం కేసీఆర్​ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే వర్సెస్​ మంత్రి అన్న పరిస్థితులు సదరు మండలాల్లో ఉండేవి.  ఈ క్రమంలో తాజాగా హరిత ప్లాజా ఘటనలో సదరు లీడర్లతో  హరీశ్​ రావు మాట్లాడడంపై ముత్తిరెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఊహించని రీతిలో తెరపైకి పల్లా రావడంతో ముత్తిరెడ్డికి టెన్షన్​ తప్పడం లేదు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్​తో తనకు ఉన్న సాన్నిహిత్యంతో ఎలాగైనా మూడో సారి టికెట్​ తెచ్చుకుని గెలువాలనే పట్టుదలతో ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21న లిస్ట్​ బయటకు రానుందని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అపార్థం చేసుకున్నరు..

బచ్చన్నపేట: తమను అధిష్ఠానం(మంత్రి హరీశ్​ రావు) రమ్మని పిలిస్తేనే ప్రగతి భవన్​కు వెళ్లామని రైతుబంధు జిల్లా కన్వీనర్​ ఇర్రి రమణారెడ్డి, బీఆర్​ఎస్​  మండల అధ్యక్షుడు బోడిగం చంద్రారెడ్డి తెలిపారు.పల్లా  వర్గంగా భావిస్తున్న రైతుబంధు జనగామ జిల్లా కన్వీనర్​ రమణారెడ్డి బచ్చన్నపేటలోని  ఓ ఫంక్షన్​హాల్​లో సర్పంచ్​లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్​ గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రగతి భవన్​ కు వెళ్లిన విషయంలో  ఎమ్మెల్యే ముత్తిరెడ్డితోపాటు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తమను అపార్థం చేసుకున్నారన్నారు. అధిష్ఠానం జనగామ టికెట్​ ఎవరికి ఇచ్చినా  మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.