ముథోల్ ​బరిలో కొత్త ముఖాలు ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న లీడర్లు

ముథోల్ ​బరిలో కొత్త ముఖాలు ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్న లీడర్లు
  •     ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు
  •     సేవా కార్యక్రమాలతో మరికొందరు
  •     ప్రధాన పార్టీల నుంచి టికెట్ల కోసం మంతనాలు

భైంసా, వెలుగు : గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.నిర్మల్​జిల్లా ముథోల్ ​అసెంబ్లీ సెగ్మెంట్​లో ఏకంగా ఐదుగురు కొత్తవారు పోటి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ లీడర్లు కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీరిలో ఇద్దరు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​నుంచి ఉండగా.. మరో ఇద్దరు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. టీజేఎస్​నుంచి ఓ యువ లీడర్​సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 

గత ఎన్నికల్లో ఇలా..

ముథోల్ ​నియోజకవర్గంలో ఓ మున్సిపాలి టీతో పాటు ఏడు మండలాలు ఉండగా మొత్తం 2,30,887 మంది ఓట్లర్లు ఉన్నాయి. అత్యధికంగా మున్నూరు కాపు ఓటర్లే 45 శాతానికి పైగా ఉన్నారు. ముస్లింలు 22 శాతం, మిగిలినవారంతా ఇతర కులాలు, మతాల వారు ఉన్నారు. అత్యధికంగా ఉన్న మున్నూరు కాపు, మైనారిటీలు ఎటు వైపు మొగ్గు చూపితే ముథోల్​లో వారిదే విజయమని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి.  2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సమీప అభ్యర్థి బీజేపీ నేత పడకంటి రమాదేవిపై 14,837 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో చేరారు. 2018 లో విఠల్ రెడ్డి ఈసారి 83933 ఓట్లు సాధించి 43331 ఓట్ల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్ 36580 ఓట్లు సాధించగా.. ఎన్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణ్​ పటేల్​ కూడా పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో స్ట్రాంగ్​గా ఉన్న విఠల్​ రెడ్డికే బీఆర్​ఎస్ పార్టీ​ ఈసారి టికెట్​ఇచ్చే  అవకాశం ఉంది. అయితే బీఆర్​ఎస్​ మినహా ఇతర పార్టీలతోపాటు, స్వతంత్రంగా ముథోల్​ నియోజకవర్గం నుంచి ఈసారి కొత్త నేతలు పోటీ  చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

నిత్యం ప్రజల మధ్య ఉంటూ..

నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరిన మోహన్​రావు పటేల్​ ఆ పార్టీ నుంచి  టికెట్ రేసులో ఉన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తరహాలోనే ప్రస్తుతం ముథోల్​ సెగ్మెంట్​లో ‘పల్లెపల్లెకు బీజేపీ.. గడప గడపకు మోహన్​రావు’ అంటూ విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతకుముందు అన్ని మండలాల్లో డబుల్​బెడ్రూం ఇండ్ల కోసం పేదలతో కలిసి ధర్నాలు చేశారు.

సేవా కార్యక్రమాలు చేపడుతూ..

కుభీర్ ​మండలం నిగ్వా గ్రామానికి చెందిన కొమ్రేవార్​కిరణ్​వృత్తిరీత్యా డాక్టర్. ప్రస్తుతం హైదరాబాద్​లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నడిపిస్తున్న ఆయన.. డాక్టర్​ కిరణ్​ ఫౌండేషన్​ పేరుతో భైంసా గవర్నమెంట్​ హాస్పిటల్​లో ఏడాది కాలంగా రోగులకు ఉచిత అల్పాహారం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయనకు పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నట్లు సమాచారం. దీంతో ఏదైనా పార్టీ లేదా స్వతంత్రంగానైనా వచ్చే ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.