
- రెడీ చేస్తున్న షీప్ ఫెడరేషన్
- సక్సెస్ అయితే జిల్లాకో క్యాంటీన్
- బ్రీడరీ సొసైటీలకు అనుసంధానం
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట సర్కారు మటన్ క్యాంటీన్లను తెరిచేందుకు సిద్ధమైంది. ఇకపై సర్కారు వారి మటన్ క్యాంటీన్ తోపాటు గవర్నమెంట్ బిర్యానీ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్ సక్సెస్ అయిన నేపథ్యంలో షీప్ఫెడరేషన్ మటన్ క్యాంటీన్‌లు తెరిచేందుకు రెడీ అవుతోంది. మాసబ్‌ట్యాంక్‌లోని షీప్ ఫెడరేషన్ స్టేట్ ఆఫీసులో మోడల్ గా చేపట్టిన మటన్ క్యాంటీన్ ఈ నెల రెండో వారంలో ప్రారంభించనున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మటన్ క్యాంటీన్‌లను విస్తరించేందుకు ఫెడరేషన్ సన్నద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన మటన్ క్యాంటీన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. సక్సెస్‌ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాంటీన్‌లు ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్ తెలిపారు.
మటన్ క్యాంటీన్‌లో నాణ్యమైన మటన్ ఉత్పత్తులు, మటన్ బిర్యానీ, కీమా , తలకాయ కూర, మటన్ టిక్కా వంటి మటన్ వెరైటీలను అందుబాటు ధరలకు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకల సంపద పెరిగిన నేపథ్యంలో మార్కెట్ కు, ప్రైమరీ బ్రీడర్ సొసైటీలకు అటాచ్ చేసి మటన్ నేరుగా అమ్ముకునేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. కురుమ, యాదవ సామాజిక వర్గాలకు మటన్ క్యాంటీన్‌ల ఏర్పాటులో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు చేపడతామని బాల్‌రాజ్ వెల్లడించారు. క్యాంటీన్ పనులపై అధికార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్, షీప్ ఫెడరేషన్ ఎండీ డాక్టర్ రామచందర్, అధికారులు డాక్టర్ శీనివాస్, డాక్టర్ వెంకటయ్య గౌడ్, డాక్టర్ సాయిరాజ్, టూరిజం డిపార్టుమెంటు నుంచి సాయి, ఫిషరిస్ క్యాంటీన్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.