ఆ అమ్మాయిలు బతికే ఉన్నరు

ఆ  అమ్మాయిలు బతికే ఉన్నరు

న్యూఢిల్లీ: రెండేండ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్​పూర్​ షెల్టర్​ హోమ్స్​ మరణాలపై సీబీఐ ట్విస్ట్​ ఇచ్చింది. ముజఫర్​పూర్ లోని ఓ షెల్టర్​ హోమ్​లో చనిపోయారన్న 35 మంది అమ్మాయిలు బతికే ఉన్నారని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో బుధవారం స్టేటస్​ రిపోర్ట్​ దాఖలు చేసింది. 2018లో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్(టీఐఎస్ఎస్) జరిపిన సర్వేలో ముజఫర్​పూర్​ షెల్టర్​హోమ్స్​లో దారుణాలు వెలుగు చూశాయి. హోమ్స్​లో అనేక మంది బాలికలపై లైంగిక, శారీరక వేధింపులు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జర్నలిస్ట్ నివేదితా ఝా ఇండిపెండెంట్​ ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. గత ఏడాది సీబీఐ బీహార్​ పొలిటికల్​ లీడర్, ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజేష్​ఠాకూర్, అతని అనుచరులపై చార్జ్​షీట్​ నమోదు చేసింది. బ్రజేష్ నడుపుతున్న షెల్టర్​ హోమ్​లో 11 మంది అమ్మాయిలు హత్యకు గురయ్యారని, హోమ్​ ఆవరణలో తవ్వి తీయగా పెద్ద ఎత్తున ఎముకలను గుర్తించినట్టు పేర్కొంది. అమ్మాయిలను అసభ్యకరమైన పాటలకు డాన్సులు చేయాలని వేధించడమే కాకుండా.. చాలా మందిపై అత్యాచారాలు, వేధింపులు జరిగినట్టు పేర్కొంది. ఇందులో రాజకీయ నాయకులు, కీలక అధికారులు ఉన్నారని తెలిపింది.

చంపినట్టు ఆధారాలు లేవు

అయితే తాజాగా సీబీఐ దాఖలు చేసిన స్టేటస్​ రిపోర్ట్​లో షెల్టర్ హోమ్‌‌‌‌లో దొరికిన అస్థిపంజరాలు ఓ మహిళ, ఓ వ్యక్తివి అని తెలిపింది. హోమ్​లోని బాలికలను చంపినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. షెల్టర్​ హోమ్స్​ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీహార్​ ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. మొత్తం 70 అధికారులపై ఆరోపణలు రాగా, ఇందులో 25 మంది ఐఏఎస్​ ఆఫీసర్లు ఉన్నారు. సీబీఐ తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ వాదనలు వినిపిస్తూ.. హోమ్​లో చనిపోయారని భావించిన అమ్మాయిలను ఆ తర్వాత బతికి ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. బీహార్​లోని 17 షెల్టర్​ హోమ్​ కేసులను సీబీఐ దర్యాప్తు చేసిందని, ఇందులో 13 కేసుల్లో సీబీఐ చార్జ్​షీట్​ దాఖలు చేసిందని చెప్పారు. నాలుగు కేసుల్లో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు ముగించిందన్నారు. సీబీఐ స్టేటస్​ రిపోర్ట్​ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్ఏ బోబ్​డే నేతృత్వంలోని బెంచ్​ ఆమోదించింది. పిటిషనర్​ తరపున లాయర్​ సోయబ్​ ఆలం వాదనలు వినిపిస్తూ షెల్టర్ హోమ్స్​లో హతీయలు జరిగాయంటూ అక్కడి అమ్మాయిలు ఇచ్చిన స్టేట్​మెంట్లను సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. కాగా, సీబీఐ రిపోర్ట్ పై వివరణ ఇవ్వాలని పిటిషనర్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది.