
- రోజూ అరగంట రీడింగ్
- జిల్లాలో మొత్తం స్కూళ్లు 540, విద్యార్థులు 53 వేల మంది
వనపర్తి, వెలుగు : ప్రభుత్వస్కూళ్లలో చదివే విద్యార్థులకు కేవలం సబ్జెక్టు బోధనే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్‌లో భాగంగా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు స్టోరీ కార్డ్స్చదివిస్తున్నారు. రాష్ట్ర సమగ్ర శిక్ష, రూమ్టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల1 నుంచి మై బుక్.. మై స్టోరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రైమరీ స్కూళ్లు, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలోని విద్యార్థులకు పఠనాసక్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1 నుంచి టెన్త్ వరకు 540 స్కూళ్లు ఉండగా, 53 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
సృజనాత్మకత పెంపు..
రోజూ పుస్తక పఠనంతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగి, భావ వ్యక్తీకరణపై పట్టు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూల్ లెవల్లోనే విద్యార్థులకు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచితే ఉన్నత విద్యాభ్యాసం, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో కంటెంట్సులభంగా మారనుంది. ఈ కార్యక్రమం కింద ప్రతి స్కూల్స్‌లో విద్యార్థుల రీడింగ్కోసం అరగంట టైం కేటాయించాలి. స్కూల్లో ఉన్న లైబ్రరీ నుంచి పుస్తకాలు తీసుకుని చదివించాలి. వాటిలో కథల పుస్తకాలు, న్యూస్ పేపర్లు, సాహిత్య పుస్తకాలనూ చదివించాలి. చదవడంతోపాటు మార్నింగ్ ప్రేయర్ టైంలో చిన్న కథలు చెప్పేలా ప్లాన్చేస్తున్నారు. ఇటీవల ప్రతి స్కూల్లోని లైబ్రరీకి 150 చొప్పున బుక్స్ అందించారు. లైబ్రరీ నిర్వహణపై టీచర్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
స్టూడెంట్లకు పోటీలు కూడా..
మారుతున్న కాలానికి అనుగుణంగా సెల్ ఫోన్ కల్చర్ వచ్చాక స్టూడెంట్లలో ఎక్స్ ట్రా కర్రికులర్ యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయి. ఇంగ్లిష్ మీడియం చదువులతో కనీసం తెలుగు సబ్జెక్టు బుక్ కూడా సక్రమంగా చదవలేని స్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, ప్రైవేట్ స్కూళ్లలో స్టూడెంట్ల పఠనాసక్తి మరీ దారుణంగా మారింది. స్టూడెంట్లలో ఆసక్తిని రేకెత్తించేందుకు మండల, గ్రామస్థాయిలో వక్తృత్వ, కథలు, రచన పోటీలు నిర్వహించనున్నారు. ఈ పఠనా కార్యకలాపాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయనున్నారు.
ప్రతిభ పాటవాలు పెరుగుతాయి..
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు పెరుగుతాయి. బయట అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడగలరు. భవిష్యత్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రభుత్వ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని కొనసాగుతోంది. మిగతా స్కూళ్లలో కూడా ప్రారంభిస్తాం. – మహానంది, జిల్లా సమన్వయకర్త, వనపర్తి