- స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హనుమకొండ, వెలుగు: ‘రాజీనామా చేస్తానని నేను ఎక్కడా చెప్పలేదు.. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కావాలని అడిగాను, స్పీకర్ నిర్ణయం, పరిస్థితులను బట్టే నా నిర్ణయం ఉంటుంది’ అని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని ‘కుడా’ వెంచర్ ఉని సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కడియం మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇచ్చారని, ఈ నెల 23లోగా వివరణ ఇవ్వాలని పేర్కొన్నారన్నారు.
ఈ మేరకు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని స్పీకర్‌ను కోరానని, స్పీకర్ సానుకూలంగా స్పందించారని, ఎప్పటివరకు టైమ్ ఇస్తారో తెలియాల్సి ఉందన్నారు. స్పీకర్ నిర్ణయం అనంతరం.. లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు తన శ్రేయోభిలాషులతో మాట్లాడి స్పీకర్‌కు వివరణ ఇస్తానని చెప్పారు. తన రాజీనామా అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, రాజీనామా చేస్తానని తానెక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.
తన నిర్ణయం ఏదైనా ఉమ్మడి వరంగల్, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఉంటుందని చెప్పారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేసేది తానేనని, నియోజకవర్గ ప్రజలు గెలిపించేదీ తననేని కడియం శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.
