
- 15వ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
- ప్రమాణం చేయించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
- కోవింద్, వెంకయ్య, మోడీ తదితరులు హాజరు
న్యూఢిల్లీ: పేదలు కలలుగనొచ్చని, వాటిని నెరవేర్చుకోవచ్చని తన ఎన్నిక నిరూపించిందని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అన్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టడమనేది తన వ్యక్తిగత విజయం కాదని, దేశంలోని ప్రతి ఒక్క నిరుపేద గెలుపని చెప్పారు. ‘‘నేను గిరిజన సమాజానికి చెందిన వ్యక్తిని. వార్డు కౌన్సిలర్‌గా పని చేయడం నుంచి భారతదేశానికి రాష్ట్రపతిగా ఎదిగే అవకాశం నాకు లభించింది. మదర్ ఆఫ్ డెమోక్రసీ అయిన ఇండియా గొప్పతనం ఇది” అని తెలిపారు. ప్రెసిడెంట్‌గా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. మాజీ ప్రెసిడెంట్లు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, ఏక్‌నాథ్ షిండే, జైరాం ఠాకూర్, యోగి ఆదిత్యనాథ్, బీరేన్ సింగ్, ఎంపీలు సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. జోహార్ అంటూ హిందీలో ప్రసంగం మొదలుపెట్టిన ముర్ము.. 18 నిమిషాలపాటు మాట్లాడారు. ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేరుకోగలదని మన దేశ ప్రజాస్వామ్యం నిరూపించిందని ముర్ము అన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవాలను ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న టైంలో ప్రెసిడెంట్ కావడం తన అదృష్టమన్నారు. సంతాల్ విప్లవం, పైకా విప్లవం నుంచి.. కోల్ విప్లవం, భిల్ విప్లవం దాకా స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల సహకారాన్ని బలపరిచాయని చెప్పారు. పదవీ విరమణ పొందిన రామ్‌నాథ్ కోవింద్, ముర్ము కలిసి రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు ఊరేగింపుగా వచ్చారు. దేవుడి మీద ప్రమాణం చేసిన ముర్ము.. రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడుతానని చెప్పారు. ముర్ము సంతకం చేస్తున్నప్పుడు 21 గన్ సెల్యూట్ చేశారు. చప్పట్లు, డెస్క్‌లు చరిచి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రెసిడెంట్ పవర్స్ ఇవీ
ఆర్డినెన్స్ జారీ చేయడం, క్షమాభిక్షలు ప్రకటించడం, శిక్షలు తగ్గించడం, ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సలహా మేరకు దేశం, రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించడం వంటి అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. రాజ్యాంగ అధిపతి అయిన ప్రెసిడెంట్.. రాజ్యాంగానికి సంరక్షులుగా ఉంటారు. పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం లోక్‌సభను రద్దు చేయగలరు. అలాగే సాయుధ దళాలకు అధిపతిగా ఉంటారు. ఐదేళ్లపాటు (2027 జులై 24 దాకా) పదవిలో ఉంటారు. రెండో సారి రాష్ట్రపతి అయ్యేందుకు కూడా రూల్స్ అనుమతిస్తాయి. అయితే ఇప్పటిదాకా తొలి ప్రెసిడెంట్ బాబూ రాజేంద్ర ప్రసాద్ తప్ప ఇంకెవరూ రెండు సార్లు అత్యున్నత పదవిలో కూర్చోలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 61లో నిర్దేశించిన విధానానికి అనుగుణంగా రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించవచ్చు. ఉప రాష్ట్రపతిని ఉద్దేశించి రాజీనామా లేఖ రాయడం ద్వారా రాష్ట్రపతి తన పదవిలో నుంచి దిగిపోవచ్చు. పార్లమెంటు సమావేశవేశమైన సందర్భాల్లో తప్ప ఇంకెప్పుడైనా ఆర్డినెన్స్‌ను పాస్ చేయగలరు. ఆర్థిక, మనీ బిల్లులను ప్రవేశపెట్టడం కోసం సిఫార్సులు చేయవచ్చు. బిల్లులకు రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన తర్వాతే అవి చట్టాలుగా మారుతాయి. ఒక రాష్ట్రంలో అధికార యంత్రాంగం విఫలమైనప్పుడు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ విధులన్నింటినీ లేదా ఏదైనా బాధ్యతను స్వయంగా స్వీకరించవచ్చు. దేశ భద్రత ముప్పులో పడ్డప్పుడు ఎమర్జెన్సీ విధించే అధికారాలు ఉన్నాయి.
ప్రపంచ నేతల విషెస్
చైనా, రష్యా, శ్రీలంక, నేపాల్, మాల్దీవుల ప్రెసిడెంట్లు సహా ప్రపంచ దేశాల నేతలు ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ముర్ముతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని ముర్ము మరింత ప్రోత్సహిస్తారన్న ఆశాభావాన్ని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వ్యక్తం చేశారు.
దేశం గర్వంతో చూసింది..: మోడీ
ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని దేశం మొత్తం గర్వంతో చూసిందని ప్రధాని మోడీ అన్నారు. ముఖ్యంగా పేదలు, అణగారిన, అట్టడుగు వర్గాలకు చారిత్రాత్మక క్షణమని చెప్పారు. ఆమె పదవీ కాలం ఫలవంతం కావాలని ఆకాంక్షించారు. తన ప్రసంగంలో ఆశ, కరుణతో కూడిన సందేశాన్ని ప్రజలకు ముర్ము ఇచ్చారని చెప్పారు. ప్రెసిడెంట్‌గా విజయవంతం కావాలని, సంపూర్ణ పదవీకాలం కొనసాగాలని వెంకయ్య నాయడు విష్ చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.