మా నాన్న ఆటో డ్రైవర్.. 

మా నాన్న ఆటో డ్రైవర్.. 

అంగమలీ అనే గ్రామంలో పుట్టి, ‘అంగమలీ డైరీస్’​ అనే సినిమాతో బాక్సాఫీస్​ దగ్గర సూపర్​ హిట్ కొట్టాడు. అసలు పేరు ఆంటోనీ వర్గీస్​. కానీ, ఆ సినిమాలోని పేరు విన్సెంట్​ పెపే అందరికీ తెలిసిన పేరు. అలా మొదటి సినిమాతోనే తన మార్క్​ వేసుకున్నాడు ఆంటోని. నాన్న ఆటో డ్రైవర్​.. ఆంటోనీ కల యాక్టర్ కావడం. అందుకే చదువు మధ్యలోనే ఆపి, షార్ట్​ఫిల్మ్స్ వైపు అడుగులు వేశాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు.. సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అంతే.. మూడో సినిమాకే ఆస్కార్​ ఎంట్రీకి ఛాన్స్ రావడంతో సినీ ప్రేక్షకులందరికీ పరిచయమయ్యాడు. తన సినిమా జర్నీ గురించి ఆంటోనీ మాటల్లో...

‘‘నా పేరు ఆంటోనీ వర్గీస్. కానీ, ఇండస్ట్రీలో నన్ను అందరూ పెపే అని పిలుస్తారు. ​అది నేను చేసిన మొదటి సినిమా ‘అంగమలీ డైరీస్​’లో నా క్యారెక్టర్ పేరు విన్సెంట్​ పెపే. అందుకనే నన్ను ‘పెపే’ అనే నిక్​ నేమ్​తో లేదా ఆంటోనీ వర్గీస్ పెపే అని పిలుస్తుంటారు. ఆ రోల్​ ఆడియెన్స్​కు అంతలా దగ్గరైంది. వార్తల్లోనూ అలానే రాయడం మొదలుపెట్టారు. అంతలా ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు కనెక్ట్​ అయింది. మొదటి సినిమాకే అంత క్రేజ్ రావడంతో తర్వాత నుంచి అవకాశాలు బాగానే వచ్చాయి. దీనికి కారణం డైరెక్టర్​ లిజో జోస్ పెళ్లెసరి. ఆయనకు నాలో ఒక మంచి యాక్టర్ కనిపించడం వల్లే పెపే రోల్​కి నన్ను సెలక్ట్ చేశారు. ఆ సినిమాకి బెస్ట్ డెబ్యూ యాక్టర్​గా ఫిల్మ్​ఫే ర్ అవార్డ్​ కూడా వచ్చింది. 


అంగమలీవాడినే..


నేను పుట్టి పెరిగింది కేరళలోని అంగమలీలో. నాన్న పేరు వర్గీస్. అమ్మ పేరు అల్ఫోన్సా. ఎర్నాకులంలోని మహారాజాస్​ కాలేజీలో ఫిజిక్స్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశా. ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇష్టం​తో పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ మధ్యలోనే ఆపేశా. నిజానికి నేను చదువులో అంత మంచి స్టూడెంట్​నేం కాదు. బుక్స్ చదవడం నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే చదువు మధ్యలోనే ఆపి, సినిమాలకు అసిస్టెంట్​గా పనిచేశా. ఆ తర్వాతే యాక్టర్ అయ్యా. సినిమా బ్యాక్​గ్రౌండ్​ లేదు. మా నాన్న ఆటో డ్రైవర్​. మిడిల్ క్లాస్​ ఫ్యామిలీ. సినిమాల్లోకి రాకముందు మా ఇంటికి మూడు ఇళ్ల అవతల ఉన్న వాళ్లు కూడా మమ్మల్ని పెండ్లికి పిలవలేదు. కానీ, నేను నటించడం మొదలుపెట్టాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు15 కిలో మీటర్ల దూరం నుంచి కూడా పెండ్లిళ్లకు ఇన్విటేషన్స్ వస్తున్నాయి.

 
షార్ట్​ ఫిల్మ్స్​లో నటించా 


మహారాజాస్​ కాలేజీలో చదువుతున్నప్పుడు షార్ట్​ ఫిల్మ్స్​లో నటించడం మొదలుపెట్టా. గ్రాడ్యుయేషన్​ అయ్యాక సింగపూర్​ బేస్​డ్​​ కంపెనీలో జాబ్​లో చేరాలనుకున్నా. అప్పుడే సినిమాలో అవకాశం వచ్చింది. నేను చేసిన ‘బలియడు’ అనే షార్ట్​ఫిల్మ్​ చూసి డైరెక్టర్​ లిజో ‘అంగమలీ డైరీస్​’ సినిమాకి తీసుకున్నారు. ఆ తర్వాత కూడా సినిమాలు చేస్తూనే షార్ట్​ ఫిల్మ్స్ కూడా చేశా. అలాంటి వాటిలో ‘మౌస్ ట్రాప్’ అనే షార్ట్​ ఫిల్మ్ కూడా ఒకటి. అందులో నాది డ్రైవర్​ పాత్ర. ఇద్దరి జీవితాల మీద ఆధారపడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథ అది. దీని డైరెక్టర్ డాక్టర్ విన్సెంట్ జోస్​ షార్ట్​ ఫిల్మ్స్ తీస్తుంటాడు. కొన్నేండ్ల కిందట కేన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్​కి ‘లైఫ్​ సెంటెన్స్’లో సెలక్ట్ అయ్యాడు. ఇలా డిఫరెంట్​ స్టోరీలు వస్తే షార్ట్​ ఫిల్మ్స్​లో కూడా నటిస్తుంటా. ఇప్పటికి పదికి పైగా షార్ట్​ ఫిల్మ్స్​లో నటించా. 
అనుబంధం పెరిగింది


నా వరకు ఫిల్మ్ ఫెస్టివల్‌‌‌‌కు ఇన్విటేషన్​ రావడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ప్రపంచం మొత్తంగా ఉన్న కొన్ని ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తారు అక్కడ. ‘అంగమలీ డైరీస్’ తర్వాత అదే డైరెక్టర్​ లిజోతో ‘జల్లికట్టు’లో కలిసి పనిచేశా. ఆ సినిమా ఇండియన్​ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా తరపు నుంచి ఆస్కార్​ ఎంట్రీకి వెళ్లింది. హాలీవుడ్ స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘జల్లికట్టు’ను చూసిన ప్రేక్షకులు కూడా సగం మలయాళీలు, మరో సగం విదేశీయులు. మా సినిమా చూస్తున్నప్పుడు వారి ఎక్స్‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌ని అంచనా వేసేవాడ్ని. ప్రముఖ నటీనటులు కూడా ఒక పాపులర్ ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్​కి వెళ్లే అవకాశం రావాలంటే చాలా ఏండ్లు ఎదురు చూడాలి. అలాంటిది ఆంటోని మూడో సినిమాతోనే, మూడో ఏడాదిలోనే ఆ అవకాశం చేజిక్కించుకున్నాడు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. లిజో సినిమాల్లో నటించడం నా అదృష్టం. నాకు ఆ అవకాశం రావడానికి కారణం ఆయనే అని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా నా కెరీర్​లో చాలా ఇంపార్టెంట్. నా మొదటి సినిమాకి ఎంత ఎగ్జయిట్ అయ్యానో, ఈ సినిమాకి అంతే ఎగ్జయిట్ అయ్యా. కాకపోతే ఈసారి కొంచెం భయం కూడా ఉంది. నేను లిజో చెప్పిన ప్రతి మాటను విని, సరిగ్గా అదే చేయాలని డిసైడ్ అయ్యా. సినిమాలో నా తోటి నటుల నుంచి కూడా కొంత నేర్చుకున్నా. 


సినిమాల వల్ల


సినిమాల వల్ల నేను చాలా ప్రదేశాలకు వెళ్లగలిగా. నా సినిమా విడుదలైనప్పుడు నేను చాలా ప్లేసెస్​కు వెళ్తా. అవార్డు షోలతో సహా ప్రోగ్రామ్స్​కి నాకు ఇన్విటేషన్ అందుతుంది. అది తప్ప, నా జీవితంలో పెద్దగా మార్పు రాలేదు. నేను గతంలో లాగానే బతుకుతున్నా. నటుడ్ని అయినందుకు ఇప్పుడు నన్ను నేను మార్చుకోవాల్సిన అవసరం లేదు. ‘అంగమలీ డైరీస్’ చేయడానికి ముందు, తర్వాత.. ఇప్పటికీ అలాగే ఉన్నా. జీవితంలో హెచ్చు తగ్గులు ఉన్నా, నేనెవరు అనేదానికి కట్టుబడి ఉండాలని నమ్ముతా. ఇది నాకే కాదు.. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారందరికీ ఇండస్ట్రీ మద్దతు ఇస్తుందని నేను అనుకుంటున్నా. సీనియర్ డైరెక్టర్స్ మనకు స్క్రిప్ట్‌‌‌‌ వినిపిస్తారు. మన సినిమాలు చూశాక, పెద్ద స్టార్స్ మాకు మెసేజ్​ లేదా ఫోన్  చేస్తారు. 

మా లవ్​ స్టోరీ

నేను, అనీషా తొమ్మిదేండ్లు ప్రేమించుకున్నాం. నా సినిమా కెరీర్ బాగా ఉన్నప్పుడే 2021లో పెండ్లి చేసుకున్నాం. కానీ, అనీషా జాబ్​ చేస్తున్నప్పుడు నేను ఖాళీగానే తిరిగా. అప్పుడు కూడా తను నాకు చాలా సపోర్ట్​ చేసేది.  

సోషల్ మీడియా 

నా మొదటి సినిమా తర్వాత నుంచి నాకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. యూత్​ సపోర్ట్​ చాలా ఉంది. ఇన్​స్టాగ్రామ్​లో మిలియన్​కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫేస్​బుక్​లో కూడా లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. ఎక్కువగా ఫేస్​బుక్​లోనే పోస్ట్​లు పెట్టేవాడిని.

మంచి సినిమాలు చేయాలి

నేను నటించాలనుకునే పాత్రలు చాలా ఉన్నాయి. నాకు ట్రావెల్ మూవీ, క్యాంపస్‌‌‌‌ రొమాన్స్‌‌‌‌, హారర్‌‌‌‌ సినిమాలు చేయాలని ఉంది. చెప్పుకుంటూ పోతే లిస్ట్​ పెద్దదే. కానీ, నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ‘పూవన్​’ అనే సినిమాలో నిద్ర సరిపోని వ్యక్తిగా నటించా. ‘యావర్​, ఆర్​డిఎక్స్, ఆరవం, దేవ్​ ఫకీర్’ సినిమాలు చేస్తున్నా.’’ 

 

  • ప్రజ్ఞ