మానవీయ కోణంలోనే నా రచనలు : తెలంగాణ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్

 మానవీయ కోణంలోనే నా రచనలు : తెలంగాణ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్

హైదరాబాద్, వెలుగు: తన కథలు మానవీయ కోణలోనే ఉంటాయని, భవిష్యత్​ ను  చూపిస్తాయని తెలంగాణ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ మంగారి రాజేందర్ పేర్కొన్నారు.  గురువారం తెలంగాణ సారస్వత పరిషత్​(టీఎస్పీ) ఆధ్వర్యంలో అబిడ్స్ లోని దేవుళపల్లి రామానుజారావు కళా మందిరంలో మంగారి రాజేందర్ రాసిన రచనలు, సాహిత్య ప్రస్తానంపై ‘నేను నా రచనలు’ పేరుతో కార్యక్రమం జరిగింది. టీఎస్పీ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ర్టార్ టి. గౌరీశంకర్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. టీఎస్పీ ప్రధాన కార్యదర్శి జె. చెన్నయ్య, శివారెడ్డి, గౌరీశంకర్ లు మంగారి రాజేందర్ ను సన్మానించారు.

అనంతరం రాజేందర్ మాట్లాడుతూ...  చిన్నప్పడు చలం, శ్రీశ్రీ  పుస్తకాలు చదివేవాడినని, వృత్తిరీత్యా న్యాయవాదిని అయిన తర్వాత కూడా  వదలలేదని గుర్తుచేశారు.  వేములవాడ కథలు తనకు పేరు తెచ్చిపెట్టాయని, ఇప్పటికీ మొదటి సిరిస్ లో 30 కథలు రాశానని, త్వరలో రెండో సిరీస్ కూడా వస్తుందని చెప్పారు. సాదత్ హాసన్ మంటో రచనలు అంటే తనకెంతో ఇష్టమని, ఆయన రచనల్లో  మానవీయత ఉంటుందని పేర్కొన్నారు.  రాజేందర్ చట్ట, న్యాయ సంబంధమైన గ్రంథాలెన్నో అనువదించారని, సాంకేతిక పరమైన అంశాలతో కూడిన అనువాదం చేశారని జె. చెన్నయ్య కొనియాడారు. రాజేందర్ గొప్ప సంస్కారవంతుడని, ఆయన ప్రసంగాలను పుస్తకాలుగా ముద్రిస్తామని, వాటి నుంచి యువత ప్రేరణ పొందుతారని శివారెడ్డి తెలిపారు.