సొంత ప్రజలపై బాంబుల వర్షం: థాయ్​ బార్డర్ లోని గ్రామంపై మయన్మార్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ 

సొంత ప్రజలపై బాంబుల వర్షం: థాయ్​ బార్డర్ లోని గ్రామంపై మయన్మార్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ 

థాయ్​ బార్డర్ లోని గ్రామంపై మయన్మార్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ 
భయంతో అడవుల్లోకి పారిపోయిన గ్రామస్తులు 
హైస్కూల్, కాలేజీ, మెడికల్ క్యాంపుపైనా దాడులు
డజన్ల కొద్దీ ప్రజలు మరణించి ఉండొచ్చన్న మీడియా 

యాంగన్:  మయన్మార్ ఆర్మీ పాలకులు సొంత ప్రజలపైనే ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించారు. థాయ్​ బార్డర్ కు దగ్గరలో ఉన్న పపున్ జిల్లా, డే పునో అనే గ్రామంపై ఆర్మీ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో పిల్లలతో సహా డజన్ల కొద్దీ ప్రజలు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ గ్రామంతో బయటి ప్రపంచానికి కమ్యూనికేషన్లు తెగిపోవడంతో కచ్చితంగా ఎంత మంది చనిపోయారన్న విషయం కూడా తెలియడం లేదని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. శనివారం ఉదయం కేరన్ నేషనల్ యూనియన్ (కేఎన్ యూ) రెబెల్స్ పపున్ జిల్లాలోని ఓ ఆర్మీ పోస్టును స్వాధీనం చేసుకుని,10 మంది సోల్జర్లను చంపినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేఎన్ యూను టార్గెట్ గా చేసుకున్న ఆర్మీ.. రాత్రి 8 గంటలకు డే పునో గ్రామంపై ఫైటర్ జెట్లతో విరుచుకుపడినట్లు మీడియా వెల్లడించింది. ఆర్మీ ఫైటర్ జెట్ల దాడులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీపంలోని అడవులకు పారిపోయారని, పిల్లలు, మహిళలతో సహా అందరూ అనేక చోట్ల షెల్టర్లలో తలదాచుకుంటున్నారని పేర్కొంది. గ్రామంలోని హైస్కూల్, జూనియర్ కాలేజీ, మెడికల్ ట్రెయినింగ్ క్యాంపుపైనా ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లు మీడియా తెలిపింది. 
అంత్యక్రియలు చేస్తుండగా కాల్పులు
మయన్మార్ ఆర్మీ డే రోజున (శనివారం)114 మంది నిరసనకారులను బలి తీసుకున్న సైన్యం.. ఆదివారం మరో ఇద్దరిని కాల్చి చంపినట్లు లోకల్ మీడియా తెలిపింది. రాజధాని నేపిడాకు సమీపంలో ఒకరు, మరో ప్రాంతంలో ఇంకొకరు చనిపోయారని పేర్కొంది. ఇప్పటివరకూ పోలీసులు కాల్చిచంపిన ప్రజల సంఖ్య 420కి పైగా ఉంటుందని వెల్లడించింది. ఇక యాంగన్ సిటీకి సమీపంలోని బగో టౌన్ లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన 20 ఏండ్ల స్టూడెంట్ డెడ్ బాడీకి ఆదివారం అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన జనం విప్లవ గీతాలు పాడుతుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. కాల్పులు స్టార్ట్ కాగానే ప్రజలంతా పారిపోయారని, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? అన్నది ఇంకా తెలియలేదని తెలిపింది. ఆదివారం దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనకారుల డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆర్మీ పాలకులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు.