పద్మపై.. అప్పుడు తల్లి, తండ్రి.. ఇప్పుడు కొడుకు

పద్మపై..  అప్పుడు తల్లి, తండ్రి.. ఇప్పుడు కొడుకు

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు సందర్భాల్లో తండ్రీకొడుకులు, భార్యాభర్తలు పోటీ చేయడం సాధారణమే. అయితే ప్రత్యర్థులు మారుతుంటారు. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే ఫ్యామిలీకి చెందిన పలువురు పోటీ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకే ప్రత్యర్థిపై ఒక ఎన్నికల్లో భార్య, మరో ఎన్నికల్లో భర్త పోటీ చేయగా, ఇపుడు అదే ప్రత్యర్థిపై వారి కొడుకు పోటీ చేస్తుండడం విశేషం. అరుదైన, ఆసక్తికరమైన ఈ పరిణామానికి మెదక్  అసెంబ్లీ నియోజకవర్గం వేదికైంది. 

పద్మపై ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్  జిల్లాలోని రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో టీఆర్ఎస్  అభ్యర్థిగా పద్మా రెడ్డి పోటీ చేయగా.. ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి వాణి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీఆర్ఎస్  పార్టీ అధినేత కేసీఆర్  పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మా రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట అసెంబ్లీ  ఉప ఎన్నికలో టీఆర్ఎస్  అభ్యర్థిగా మళ్లీ పద్మా రెడ్డి పోటీలో ఉండగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనంపల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. 

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం రద్దయి ఆ నియోజకవర్గంలోని రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాలు మెదక్   అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసిపోయాయి. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన జనరల్  ఎలక్షన్లలో  టీడీపీ, టీఆర్ఎస్  పొత్తు పెట్టుకుని మహాకూటమిగా ఆవిర్భవించాయి. ఈ  పొత్తులో భాగంగా మెదక్  అసెంబ్లీ స్థానం టీడీపీకి కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన మైనంపల్లి హన్మంత రావుకు టికెట్  దక్కింది. టీఆర్ఎస్  టికెట్ ఆశించి భంగపడ్డ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే పద్మా  రెడ్డి టీఆర్ఎస్  అధిష్టానం తీరును నిరసిస్తూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో హన్మంత రావు రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పద్మా రెడ్డి వరుసగా రెండుసార్లు మైనంపల్లి హన్మంత రావు చేతిలో ఓటమి చవిచూశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మైనంపల్లి హన్మంత రావు హైదరాబాద్ లోని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లిపోయారు. 

ఆ తరువాత వరుసగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పద్మా రెడ్డి మెదక్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్  పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పద్మా రెడ్డికి  బీఆర్ఎస్  హైకమాండ్ పార్టీ టికెట్  ఇచ్చింది. కాగా, అనూహ్యంగా ఆమె పాత ప్రత్యర్థి అయిన ప్రస్తుత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు తన కొడుకు డాక్టర్  మైనంపల్లి రోహిత్ ను మెదక్  నియోజకవర్గంలో రాజకీయ అరంగేట్రం చేయించారు. రోహిత్  బీఆర్ఎస్  పార్టీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ హైకమాండ్ మళ్లీ సిట్టింగ్  ఎమ్మెల్యే పద్మా రెడ్డికే టికెట్  కేటాయించింది. 

దీంతో హన్మంత రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్  పార్టీ మెదక్  టికెట్ ను రోహిత్ కు కేటాయించింది. గతంలో పద్మా రెడ్డి మీద రోహిత్  తల్లి మైనంపల్లి వాణి, తండ్రి హన్మంత రావు పోటీ చేయగా, ఇపుడు వారి కొడుకు రోహిత్ పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పద్మా రెడ్డితో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన మైనంపల్లి రోహిత్  తలపడుతుండడంతో అందరి దృష్టి మెదక్  అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి  నెలకొంది.