అజీజ్ నగర్ చెరువులో కట్టిన హరీశ్ రావు ఫామ్‌హౌస్ను కూల్చేయాలి : మైనంపల్లి హన్మంత రావు

అజీజ్ నగర్ చెరువులో కట్టిన హరీశ్ రావు ఫామ్‌హౌస్ను కూల్చేయాలి : మైనంపల్లి హన్మంత రావు
  •     హైడ్రాకు ఆదేశాలు ఇవ్వండి 
  •     సీఎం రేవంత్‌కు మైనంపల్లి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ శివారులోని అజీజ్ నగర్ చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు అక్రమంగా కట్టుకున్న ఫామ్ హౌస్ ను  కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంత రావు విజ్ఞప్తి  చేశారు. ఇందుకోసం హైడ్రాకు ఆదేశాలివ్వాలని కోరారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మైనంపల్లి మాట్లాడారు. 

సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడిన భాషను తాము ప్రయోగిస్తే వారు తట్టుకోలేరని అన్నారు. భాషను భ్రష్టు పట్టించిందే బీఆర్ఎస్​వాళ్లని ఫైర్ అయ్యారు. ‘‘మా పార్టీ క్యాడర్ కు మేము పిలుపునిస్తే మీ అడ్రస్ లు గల్లంతవుతాయి.. జాగ్రత్త’’ అని హెచ్చరించారు. 

బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సంసారం, తాము మాట్లాడితే వ్యభిచారమా..? అని మైనంపల్లి ప్రశ్నించారు. ‘‘తెలంగాణ ఉద్యమం పేరుతో అడ్డగోలుగా దోచుకున్నది మీరే. అసైన్డ్ భూములు అమ్ముకొని దోచుకున్నది కూడా మీరు కాదా?’’ అని మండిపడ్డారు. ‘‘అమెరికాలో చదివిన కేటీఆర్ సంస్కారం ఎటు పోయింది? సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చదవకపోయినా ఆయనలో సంస్కారం ఉంది” అని అన్నారు.