V6 News

ఆత్మల నది.. సలసల కాగే నీటి ప్రవాహం.. 2016 లో బయటపడిన బాయిలింగ్ రివర్ వింతల గురించి..

ఆత్మల నది.. సలసల కాగే నీటి ప్రవాహం.. 2016 లో బయటపడిన బాయిలింగ్ రివర్ వింతల గురించి..

పచ్చని చెట్లు.. బండరాళ్ల మధ్య పరవళ్లు తొక్కుతూ గలగలా పారే నది. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది అక్కడి సీన్. కానీ, ఆ నదిలో ఈత కొట్టడం కుదరదు. నీళ్లు సలసలా మసులుతూ ఉడికించేస్తాయి. షానై-టింపిష్కా (షానరుతింపిష్కా).. ఈ భూమ్మీద బాయిలింగ్ రివర్ గా పేరుగాంచింది. పెరూ దేశపు అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఈ ప్రకృతి వింత కనిపిస్తుంది. ఈ నదిలో ఆత్మలుంటాయని ఇక్కడి తెగ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు.

అమెజాన్ అడవుల్లో స్వర్ణ పట్టణం 'ఎల్డోరా డో' ఓ మిస్టరీ. ఆ పట్టణానికి వెళ్లకుండా వింత జీవులు అడ్డుకుంటాయని కథ ప్రచారంలో ఉంది. తోవలోనే ఈ వేడి నదిని కూడా 'లా బొంబా" అనే దేవత ఏర్పాటు చేసిందని చెబుతుంటారు. అందుకే ఈ నదికి 'లా బొంబా' అనే ఇంకో పేరు ఉంది. అమెజాన్ నదికి ఇది ఉప నది. మయన్ టుయా గ్రామం సరిహద్దు గుండా ప్రవహించి అమెజాన్లో కలుస్తుంది. షామన్ తెగ ప్రజలు దీనిని పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ నది చరిత్ర బయటి ప్రపంచానికి తెలియడానికి చాలా ఏళ్లు పట్టింది. చివరకు ఆండ్రెస్ రూజో (30) అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చాడు.

అడుగడుగునా వింత

నికారగువా ప్రాంతానికి చెందిన ఆండ్రెస్ చిన్నతనంలో తాతయ్య చెప్పే కథలు వింటూ పెరిగాడు. అందులో 'ఎల్ డొరాడో' లాంటి మిస్టరీ కథలపై ఆసక్తి చూపించేవాడు. టెక్సాస్ లో భూభౌతిక శాస్త్రంలో పీహెచ్ డీ చేశాడతను. పరిశోధనల్లో భాగంగా అతను ఎంచుకున్న సబ్జెక్ట్ 'షానరుతిం పిష్కా' నది గురించి. ప్రమాదకరమని ఇంట్లోవా ళ్లు హెచ్చరించినా మయన్ టుయాకు ప్రాంతానికి బయలుదేరాడు. నది పరివాహక ప్రాంతానికి వెళ్లగానే అతనికి కనిపించిన తొలి దృశ్యం షామన్ తెగ వ్యక్తి ఒకతను ఫ్లూట్ వాయిస్తుండడం. ఆ దృశ్యాన్ని ఫొటో తీసి భద్రపరిచాడతను. వెంట ఉన్న గైడ్ సాయంతో ఆ షామన్ వివరాల్ని తెలుసుకున్నాడు. 

అయితే నది గురించి చెప్పేందుకు తొలుత భయపడ్డ ఆ షామన్.. తర్వాత పూర్తి వివరాల్ని తెలియజేశాడు. వేడి నీళ్లుంటాయి కాబట్టి మనుషులెవరూ ఈ నదిలో దిగేందుకు సాహసించరు. కప్పలు, పాములు, పక్షులు ఈ నదిలోపడి చనిపోతుంటాయి. వర్షాలు కురిసిన సమయంలో మాత్రం నదిలో నీరు చల్లబడుతుంది. అప్పుడు మాత్రమే షామన్లు నదిలో ఈతకొడుతుంటారట. 

అంత వేడి నీటిలో కూడా కొన్ని సూక్ష్మజీవజాలాలు, చెట్లు, కొన్ని చేపలు జీవించగలుగుతున్నాయి. ఈ జీవ జాలానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక్కడి చెట్లను షామన్లు వైద్యానికి ఉపయోగించుకుంటున్నారు. సలసలా కాగే ఈ నది ఆరున్నర కి.మీ.ల మేర ఉధృత వేగంతో ప్రవహించి అమెజాన్లో కలుస్తుంది. మొత్తానికి ఆండ్రెస్ ప్రయత్నంతో 2016లో 'బాయిలింగ్ రివర్' కథ ప్రపంచానికి తెలిసింది.

చుల్లాచకీ.. నమ్మకం

ఈ నది ముఖద్వారం యకుమామా ప్రాంతంలో ఉంది. అయితే అక్కడికి వెళ్లేందుకు మాత్రం వాళ్లు సాహసించరు. 'ఎల్ డొరాడో' గోల్డ్ సిటీకి దాన్ని ముఖద్వారంగా భావిస్తారు. యకుమామా దగ్గర చుల్లాచకీస్ వింత జీవులు కాపలా కాస్తుంటాయట. చుల్లాచకీస్ రూపం మార్చుకుని అక్కడికి వచ్చేవాళ్లను చంపుతాయని కథలు చెబుతుంటారు షామన్లు. ఇంతకీ ఎల్ డొరాడో వెనుక ఉన్న కథేంటంటే... ఒకప్పుడు ఇక్కడ ఇన్ కా ప్రజలు జీవించారు. వాళ్ల దగ్గర బంగారం కుప్పలుగా ఉండేదట. విషయం తెలిసిన వైకింగ్, యూరోపియన్ కాలనీలు ఇన్ కా ప్రజల్ని చంపి బంగారాన్ని దోచుకెళ్లాయి. 

దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఇన్కాలు ఏకంగా ఒక బంగారు పట్టణాన్ని నిర్శించుకున్నారట. ఎవరైనా బంగారం కోసం వెళ్తే ప్రాణాలు పోవాలని శాపం విధించారట. ఇన్ కా ప్రజల దేవత 'లా బొంబా' ఇక్కడికి ఎవరూ చేరకుండా ఆటంకాలు ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే చుల్లాచకీస్, మరిగే సదిని ఏర్పాటు చేసిందని షామన్లు చెబుతారు. 

ఈ కథ విన్నాక కూడా ఆండ్రెస్ రిస్క్ చేశాడు. ముగ్గురు సభ్యుల బృందంతో యకుమామాకి బయలుదేరాడు. ఇంతలో భారీ వర్షం కురిసి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. కాస్తుంటే యాండ్రెస్ అండ్ టీం ప్రాణాలు పోయేవే. కానీ, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. కాస్త ముందుకు వెళ్లాక ఒక కొండ రాయి పాము ముఖాకృతిలో ఉంది. ఆ కొండ రాయి దగ్గరే నది నీరు ఉబుకొస్తోంది. అక్కడ నీరు చల్లగానే ఉంది. కానీ, కాస్త ముందుకు రాగానే వేడి నీటి తావు మొదలైంది.

వేడి నది ఎలా..?

ఈ నదిలో నీళ్ల ఉష్ణోగ్రత 50-80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే 'బాయిలింగ్ రివర్ అని పేరుంది. ఇక్కడ అగ్నిపర్వతాలు 700 కిలోమీ టర్ల దూరంలో ఉన్నాయి. అందుకే చాలామంది ఈ నది కథనాన్ని కొట్టిపా రేశారు. అండ్రెస్ రూజో మాత్రం సూర్య తాపం వల్లే ఆ నదిలోని నీళ్లు వేడెక్కుతున్నాయని మొదట అనుకున్నాడు. కానీ, తర్వాతే అసలు విషయం కనిపెట్టాడు. కొన్ని నదులు అంతర్వాహినులుగా(భూమి పోరల్లో) ప్రవహిస్తాయి. 'ఫాల్ట్ లైన్'ల గుండా భూమి లోలోపల వరకు చేరుకుంటాయి. 

అక్కడి నీరు చాలా చల్లగా ఉంటుంది. అయితే మయనుయాలో మధ్యధరా వాతావరణం కారణంగా వేడి బాగా ఎక్కువ. దీంతో వేడి, చల్లటి నీటి మధ్య రియాక్షన్ల జరిగి వేడి నీళ్లు పైకి ఎగదోసుకువస్తుంది. వీటిని 'నాన్-వొల్కా నిక్ హాట్ స్ప్రింగ్స్' అంటారు. అండీస్ పర్వత ప్రాంతంలోని మంచు నీరు ఫాల్ట్ లైన్ల ద్వారా అట్టడుగుకు చేరి ప్లంబింగ్ వ్యవస్థ తరహాలో ఇక్కడికి చేరిందని ఆండ్రెస్ వివరించాడు.