- ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత
 - హత్య కేసులో ఇంకా రాని క్లారిటీ
 - నిందితుడి కోసం ఐదు ప్రత్యేక
 - టీమ్‌లతో పోలీసుల గాలింపు
 - సీసీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు
 - త్వరలోనే వివరాలు వెల్లడిస్తామంటున్న పోలీసులు
 
ఖమ్మం/చింతకాని, వెలుగు: ఖమ్మం జిల్లా చింత కాని మండలం పాతర్లపాడులో గత నెల 31న జరిగిన సీపీఎం నేత, రైతు సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు(73) మర్డర్‌మిస్టరీ వీడలేదు. ఎవరు, ఎందుకు చంపారనేది క్లారిటీ రాలేదు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు టీమ్ లు గాలింపు చేస్తుండగా.. కేసులో పురోగతి కనిపించడం లేదు. బయటి వ్యక్తి వచ్చి హత్యకు పాల్పడ్డాడని స్పష్టత వచ్చినా, అతనెవరు, ఎక్కడి నుంచి వచ్చాడనేది తేలలేదు.
హత్యకు ముందు, తర్వాత ఆ ఏరియా లో సెల్‌టవర్ సిగ్నల్స్ ఆధారంగా కాల్ డేటాను పోలీసులు సేకరించారు. దాని ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పాతర్లపాడులో సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు సవాల్ గా మారింది. ఆర్ఎంపీ ఇంటి వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉండగా, అందులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని పోలీసులు ఎంక్వైరీ చేసినా ఫలితం దక్కలేదు.
మర్డర్ తర్వాత నిందితు డు పారిపోయే సమయంలో చూసినవాళ్లు కూడా సహకరించకపోవడం పోలీసులకు సమస్యగా మారింది. కాగా.. హత్య స్కెచ్ వేసింది ఎవరనేది ఇంట్రస్టింగ్ గా మారింది. రెక్కీ లేకుండా ఒక్కడే బయటి నుంచి వచ్చి, రాత్రంతా ఇంటిపైన దాక్కుని, రామారావు నిద్రలేచేది గుర్తించి దాడి చేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. గ్రామానికి చెందిన ఎవరి సహకారం లేకుండా తప్పించుకొని పోవడం కూడా అసాధ్యమని పేర్కొంటున్నారు. మృతుడు రామారావు, హంతకుడి మధ్య పెనుగులాట జరిగింది. మృతుడి చేతిలో నిందితుడి టీ షర్ట్ ముక్కలు ఉన్నాయి. ఇంటిపక్కన డాబాపై జత చెప్పులు దొరకగా.. హంతకుడివేనని పోలీసులు భావిస్తున్నారు.
ఎరుపు, నలుపు రంగు టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి తన భర్తను కత్తితో పొడుస్తుండగా, గ్రామానికి చెందిన ఐదుగురు పక్కనే ఉన్నారంటూ మృతుడి భార్య స్వరాజ్యం పోలీసులకు కంప్లయింట్ చేశారు. పాతర్లపాడుకు చెందిన బొర్రా ప్రసాద్, కంచుమర్తి రామకృష్ణ, మద్దినేని నాగేశ్వరరావు, కాండ్ర పిచ్చయ్య, కొత్తపల్లి వెంకటేశ్వర్లు పేర్లు అందులో పేర్కొన్నారు. అయితే ఎంక్వైరీ జరుగుతోందని, పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
