తొనిగండ్లలో వీడిన దివ్యాంగురాలి హత్య మిస్టరీ .. నగల కోసం హత్య చేసిన ప్రియుడు

తొనిగండ్లలో వీడిన దివ్యాంగురాలి హత్య మిస్టరీ .. నగల కోసం హత్య చేసిన ప్రియుడు

రామాయంపేట, వెలుగు: మెదక్​ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్లలో ఈ నెల 13న జరిగిన దివ్యాంగురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. నగల కోసం ప్రియుడే హత్య చేశాడని, అతడిని అరెస్ట్  చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ వెంకటరాజా గౌడ్  తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బ్యాగరి మణెమ్మ(37)కు అక్క భర్త(బావ)తో పెండ్లి జరిపించారు. ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఆ తరువాత తల్లిగారింటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో పక్క గ్రామమైన రామలక్ష్మణపల్లికి చెందిన కొండని రవితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది.

 6 నెలల కింద మణెమ్మ కూతురు వివాహం జరగగా, పెండ్లిలో మణెమ్మ ధరించిన బంగారు ఆభరణాలపై రవి కన్ను పడింది. వాటిని ఎలాగైనా కాజేయాలని ఈ నెల 12న స్వర్ణగిరి టెంపుల్  పోదామని చెప్పి ఆమెను కామారెడ్డికి పిలిపించి, అక్కడి నుంచి తన కారులో గజ్వేల్  వరకు వెళ్లారు. అక్కడ హత్య చేసేందుకు వీలు కాకపోవడంతో తిరిగివచ్చారు. తొనిగండ్ల శివారులో మద్యం తాగి, రాత్రి కావడంతో అక్కడే పడుకున్నారు. ఆ తరువాత మణెమ్మ దగ్గర ఉన్న చున్నీని మెడకు చుట్టి, తలపై బండరాయితో మోది చంపేశాడు. ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడుతో పాటు చెవి కమ్మ, బంగారు మాటీలతో కలిపి మూడున్నర తులాల బంగారు నగలను తీసుకొని పరారయ్యాడు. నగలు అమ్మడానికి కామారెడ్డికి వెళ్తుండగా, రవిని అరెస్ట్​ చేసి బంగారు నగలు, కారు, సెల్ ఫోన్  స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.