గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన యువతి హత్య కేసు మిస్టరీ వీడింది. పెండ్లికి ఒప్పుకోవడం లేదన్న కోపంతో అదే గ్రామానికి చెందిన యువకుడు యువతిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ గురువారం బసంత్‌నగర్ పీఎస్‌లో వెల్లడించారు. పుట్నూర్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వేల్పుల స్వామి అదే గ్రామానికి చెందిన బౌతు సుమలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే స్వామి మద్యానికి బానిస కావడంతో.. తాగుడు మానితేనే పెండ్లి చేసుకుంటానని సుమలత స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో కావాలనే తనను దూరం పెడుతోందని అనుమానం పెంచుకున్న స్వామి మంగళవారం రాత్రి సుమలత ఇంట్లోకి వచ్చి గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన అనంతరం పరార్ అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై నూతి శ్రీధర్ ఆధ్వర్యంలో స్వామి కోసం గాలించగా... గురువారం ఈసాలతక్కళ్లపల్లిలోని సమ్మక్క గద్దెల వద్ద కనిపించడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
