
- బెట్టింగ్ యాప్స్ విషయంలో డీజీపీ, మెట్రో ఎండీ, మాజీ సీఎస్ శాంతి కుమారిపై ఆరోపణలు
- సుమోటోగా నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. మెట్రోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపిస్తూ అన్వేష్ ఒక వీడియో చేశాడు. ఇందులో తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్ దాన కిశోర్, వికాస్ రాజ్ పై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా వారు రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్నాడు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే అన్వేష్ ఆ వీడియో చేశాడని, అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల విశ్వసనీయత, పేరుప్రతిష్టలను దెబ్బతీసేలా, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా వీడియో ఉందని సైబరాబాద్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, ఆ వీడియోను అతను 12 గంటల్లోనే డిలీట్ చేశాడు. అప్పటికే లక్షల్లో వ్యూస్ వెళ్లిపోయాయి. అతను ‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ పేరిట రెండు యూట్యూబ్ చానెల్స్ నిర్వహిస్తున్నాడు. ఈ రెండింటికీ 44 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. మెట్రోపై నా అన్వేషణ యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేయగా, ఆ చానెల్‌కు 2.38 మిలియన్ల మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పేర్లను బహిర్గతం చేస్తూ అన్వేష్ ఇటీవలే పలు వీడియోలు చేశాడు.
అవేర్‌నెస్ కల్పిస్తే కేసులా?: అన్వేష్
తనపై కేసు నమోదు కావడంపై అన్వేష్ స్పందించాడు. రెండు నెలలుగా బెట్టింగ్ యాప్‌ల నిర్మూలనపై సామాజిక బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నానని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అమాయకులను బెట్టింగ్ ఊబిలోకి ఎలా లాగుతున్నారో వివరిస్తున్నానని, అలాంటి తనపై కేసు పెట్టడం ఏమిటని అన్వేష్ ప్రశ్నించాడు. ఎన్నో ఏండ్లుగా మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాడ్స్ ప్రచారం చేస్తుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తనపై కేసులు నమోదు చేయడం కరెక్టుకాదన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కు బలైన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఇస్తున్నానని, ఇప్పటికి ఐదు కుటుంబాలకు ఆర్థికసాయం చేశాననన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బెట్టింగ్ యాప్‌లపై అవగాహన కల్పిస్తూనే ఉంటానని అన్వేష్ స్పష్టం చేశాడు.