
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు బుధవారం కూల్చివేశారు. బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 78, 81-,86, 90లో 1986లో టెలికాం కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వెంచర్ ఏర్పాటు చేసి, టెలికాం ఉద్యోగులకు ప్లాట్లు పంపిణీ చేసింది. ప్లాట్ లు పొందిన వారంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కావడంతో ఎక్కడెక్క డో సెటిల్ అయ్యారు.
2016లో ధరణి ద్వారా అక్రమ పాస్‌బుక్‌లు సృష్టించి, సొసైటీకి చెందిన భూమిలో మరో కొత్త వెంచర్‌ను పాత భూ యజమానులు ఏర్పాటు చేశారు. అయితే, పాత వెంచర్లో రోడ్డు నిర్మాణం కోసం ఉంచిన భూమిలో 200 గజాల నుంచి 253 గజాల వరకు నాలుగు ప్లాట్లను కొంతమంది రిజిస్టేషన్ చేసుకున్నారు. ఈ అక్రమాలను గమనించిన అసలైన ప్లాట్ యజమానులు కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితులు ఇటీవల హైడ్రాను ఆశ్రయించారు.హైడ్రా అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా మంజూరైన ఇంటి నంబర్లు, పర్మిషన్లను రద్దు చేసి అక్కడ నిర్మించిన చిన్న చిన్న అక్రమ నిర్మాణాలు, గోడలను కూల్చివేశారు.
పుప్పాలగూడలో ఐదు నిర్మాణాల నేలమట్టం
గండిపేట: మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడలోని నెమలీనగర్లో ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు బుధవారం కూల్చివేశారు. 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఐదు ప్లాట్లుగా విభజించి నిర్మాణాలు చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు ఈ నిర్మాణాలను నేలమట్టం చేసి, ప్రభుత్వ బోర్డులు ఏర్పాటు చేశారు. మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.